టీమ్ ఇండియా స్వయంకృతం
స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో పాకిస్తాన్ బౌలర్లు అమోఘమైన ప్రావీణ్యం కనబరిచారు. ఇక ఆస్ట్రేలియా టెయిలెండర్లు ప్రతి బంతికి లక్ష్యం గడ్డుగా మారుతున్నప్పటికీ మొక్కవోని పట్టుదలతో ఆ ఒత్తిడిని జయప్రదంగా అధిగమించారు. ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్ లో మధ్య, చివరి ఓవర్లలో పోటీ నువ్వా నేనా అనే రీతిలో సాగింది. చివరకు బౌలింగ్ జట్టుకు పడిన కష్టానికి తగిన ఫలితం లభించలేదు. టెయిలెండర్లు క్రీజు వద్ద ఉండగా చివరి పది ఓవర్లలో రెండు మెయిడెన్లు అయిన ఉదంతం ఆఖరిసారిగా ఎప్పుడు జరిగింది?
అయితే, భారత జట్టులో ప్రతిభకు లోటు లేదు. కాని సెమీస్ కు చేరుకోవడానికి కావలసిన నైపుణ్యం గాని, పట్టుదల గాని జట్టులో లుప్తమయ్యాయి. జట్టు ఆడగా పూర్తయిన రెండు మ్యాచ్ లలో అసలు మెరుపే కనిపించలేదు. పాకిస్తాన్ తో మొదటి గేములో ఇటు బ్యాటింగ్ లోను, అటు బౌలింగ్ లోను మిడిల్ ఓవర్లలో అనుసరించిన రక్షణాత్మక వ్యూహం జట్టుకు నష్టదాయకంగా పరిణమించింది.
ఈ సంవత్సరం పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇండియా రికార్డు అంతగా తీసివేయదగినదిగా లేకపోయినప్పటికీ మూడు కన్నా ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నమెంట్ (ప్రపంచ టి20, చాంపియన్స్ ట్రోఫీ)లో సెమీ ఫైనల్ దశను జట్టు చేరుకోకపోవడం ఇది రెండవ సారి. గెలవడానికి ఏమాత్రం ఉపకరించని (లేదా వివాదాస్పదమైన) భారీ డాక్యుమెంట్లను రూపొందించడం కన్నా బోర్డులోని మేధావి వర్గం మరింత అర్థవంతమైన చర్చ సాగించవలసిన అవసరాన్ని ఇది సూచిస్తున్నది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షార్పణం కాకపోయి ఉంటే ఇండియా గెలిచి ఉండేదనడం నిజమే. కాని పాయింట్లు పంచుకోవలసి వచ్చింది. అయితే, అది నిరాశను కలిగించడానికి బదులు ఆశను రేకెత్తించింది. ఈ టోర్నీలో క్రీడా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే జట్టులో కృషి చేయకుండా ఆశలతో ముందుకు సాగిందనే అభిప్రాయం పరిశీలకులకు కలిగింది.
అయితే, వెస్టిండీస్ తో చివరి మ్యాచ్ లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నమాట నిజమే. బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ బ్యాట్స్ మన్ లు సునాయాసంగానే గెలుపు లక్ష్యాన్ని అధిగమించారు. చివరకు ధోని చొరవగా తన వికెట్ కీపింగ్ గ్లవ్ లను విడిచి మీడియం పేస్ బౌలింగ్ తో రెండు ఓవర్లు వేయడమే కాకుండా తన తొలి వికెట్ కూడా సాధించాడు. అసలు కావలసిన సమయంలో జట్టు సత్తా చూపలేకపోయింది. లోటుపాట్లు కనిపించాయి. ఇక ముందైనా జట్టు తిరిగి రాణించాలంటే ఆ లోటుపాట్లను సరిదిద్దవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 1 October, 2009
|