ఫైనల్స్ లో న్యూజిలాండ్ ఆ దశలో రెడ్మండ్, టేలర్ కలసి జట్టును ఒడ్డుకు చేర్చేందుకు శాయశక్తులా కష్టపడ్డారు. వీరిద్దరి భాగస్వామ్యంపైనే జట్టు కూడా ఆశలు పెంచుకుంటున్న తరుణంలో ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పట్టడంతో ఇక న్యూజిలాండ్ పని అయిపోయినట్లేనన్న అనుమానం ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలోనే దిగిన గ్రాంట్ ఎలియట్ కెప్టెన్ వెట్టోరితో కలసి చావో రేవో తేల్చుకోవాలనంత కృత నిశ్చయంతో బాటింగ్ చేశాడు. ఎలియట్ ఒక వైపు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెట్టించగా వెట్టోరి అతనికి అండగా నిలిచి న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరుకునే కలను సాకారం చేయగలిగాడు. ఎలియట్ 103 బంతుల్లో 75 పరుగులు చేయగా, వెట్టోరి 42 బంతులలో 41 పరుగులు చేసి 47.5 ఓవర్లలోనే పాకిస్తాన్ ఫైనల్స్ ఆశలపై నీళ్ళు గుమ్మరించారు.
మొదటి బాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 21 ఓవర్ల లోపే టాప్ ఆర్డర్ లోని నలుగురు కీలకమైన బ్యాట్సమెన్ లను కోల్పోయి కేవలం 86 పరుగుల స్కోరుతో తల్లడిల్లిపోయింది. ఆ స్థితిలో యూసుఫ్ (45) అనుభవం, అక్మల్ (55) దూకుడు పాకిస్తాన్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోశాయి. వీరిద్దరూ కలసి 80 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఒక్కసారి ఈ ఇద్దరి జోడీ నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్ లోయర్ ఆర్డర్ మళ్ళీ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. ఆమెర్, అజ్మల్ కలసి ఆఖరి వికెట్ కు 34 బంతులలో సాధించిన 35 పరుగులతో పాకిస్తాన్ కాస్తంత గౌరవప్రదమైన స్కోరుతో గట్టెక్కగలిగింది.
Pages: -1- 2 News Posted: 4 October, 2009
|