స్వదేశంలో ఓటముల సెంచరీ
తాను, గంభీర్ (68) కలసి బ్యాట్ చేస్తున్నప్పుడు 30వ ఓవర్ సమయానికి జట్టు స్కోరును 150కి చేర్చాలని వ్యూహం రూపొందించుకున్నట్లు ధోని తెలియజేశాడు. 'కాని పవర్ ప్లేలలో వికెట్లు కోల్పోయాం. అవి మరీ ఎక్కువగా ఉన్నాయి. అదే మలుపు తిప్పింది' అని అతను పేర్కొన్నాడు. ఒక జట్టుగా 'క్లిక్' కాలేకపోయినందుకు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ను కూడా ధోని తప్పు పట్టాడు. మాలో ఒక్కరు (గంభీర్) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. భారీ సెంచరీ స్కోరు చేసే క్రీడాకారుడు ఒక్కడు ఉన్నా పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేది. అలా కాకపోయినా, ఒక సెంచరీ భాగస్వామ్యం, లేదా కనీసం ఒకటి రెండు 75 పరుగుల భాగస్వామ్యాలు నమోదు కావలసిన అవసరం ఉంది. కాని అలా జరగలేదు' అని ధోని వాపోయాడు.
అయితే, హర్భజన్ తో సహా తమ జట్టులోని బౌలర్లను ధోని సమర్థించాడు. కాని చివర్లో కీలక సమయంలో వారు ఇంకా మెరుగ్గా బౌల్ చేసి ఉండవలసిందని అతను అభిప్రాయపడ్డాడు. 'ఫాస్ట్ బౌలర్లు మొదటి 15 ఓవర్లలో బాగా చక్కగా బౌల్ చేశారు. చివర్లో చక్కగా బౌల్ చేసేట్లు చూడవలసిన అవసరం ఉంది. స్పిన్నర్లను కూడా తప్పు పట్టజాలం. పిచ్ నుంచి అంతగా తోడ్పాటు లభించని సమయంలో మొదట బౌల్ చేయడానికి, కాలి గుర్తులను అవకాశంగా తీసుకుంటూ తరువాత బౌల్ చేయడానికి మధ్య తేడా ఎంతో ఉంది' అని ధోని వివరించాడు.
ఇక యువ పేసర్ ఇశాంత్ శర్మ ఈ మ్యాచ్ లో బౌల్ చేసిన తీరును గమనిస్తే అతను తన 'రిదమ్' తిరిగి సాధించినట్లు తేలుతుందని ధోని పేర్కొన్నాడు. 'అతను బాగా బౌల్ చేశాడు. అతను తిరిగి రిదమ్ సాధించాడు' అని ధోని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో షేన్ వాట్సన్ తో సహా ఆరుగురు రెగ్యులర్ బౌలర్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్న విషయాన్ని ధోని గుర్తు చేశాడు. కాగా, యువరాజ్ సింగ్ లేని దృష్ట్యా చివరి వరకు ఉండి మ్యాచ్ ను గెలిపించగల బ్యాట్స్ మన్ కొరత గురించిన ప్రశ్నకు ధోని సమాధానం ఇస్తూ, అటువంటి క్రీడాకారులు ఒక్కసారిగా రారని, వారిని అలా తయారు చేసుకోవలసి ఉంటుందని అన్నాడు.
Pages: -1- 2 News Posted: 26 October, 2009
|