రెండో వన్డే మనదే టాస్ గెలిచిన ఆసీస్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పాంటింగ్ ఆహ్వానం మేరకు వీరేంద్ర సెహ్వాగ్ - సచిన్ టెండుల్కర్లతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే, ఆట 3.3వ ఓవర్ లో సచిన్ తన వ్యక్తిగత స్కోరు 4 పరుగుల వద్ద అవుటయ్యాడు. సిడిల్ వేసిన బంతిని సి.వైట్ చేతికి క్యాచ్ ఇచ్చి సచిన్ వెనుదిరిగాడు. ఎనిమిది బంతులు ఆడిన సచిన్ ఒక బౌండరీ చేయడం మినహా పైన ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అప్పటికి భారత జట్టు స్కోర్ 21 పరుగులే. ఒన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన గౌతం గంభీర్ చెలరేగి ఆడాడు. ఓపెనర్ సెహ్వాగ్ - గంభీర్ చక్కని అవగాహనతో ఆడి స్కోరును పెంచారు. ఆట 10.1వ ఓవర్లో జాన్సన్ బంతిని ఆడిన సెహ్వాగ్ హిల్ఫన్హాస్ చేతికి బంతిని అందించి పెవిలియన్ చేరాడు. అప్పుడు భారత్ స్కోర్ 67 పరుగులు ఉంది.
సెహ్వాగ్ అవుటైపోవడంతో టూ డౌన్ లో బరిలోకి వచ్చిన యువరాజ్ సింగ్ కూడా దూకుడుగానే ఆడాడు. 24 బంతుల్లో ఒక సిక్సర్, 2 బౌండరీల సాయంతో 23 పరుగులు చేశాడు. ఆట 15.1వ ఓవర్ వద్ద యువీ హిల్ఫిన్హాస్ కు కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్ వద్దకు వచ్చిన భారత స్కిప్పర్ ధోనీ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. ఆసీస్ బంతులను మైదానం నలుమూలలకూ పరుగులు పెట్టించాడు. అయితే 33.6వ ఓవర్ వద్ద ఎన్. హారిట్జ్ త్రోకు గంభీర్ రన్నౌట్ అయిపోయాడు. తరువాత ధోనీ తనకు తోడుగా వచ్చిన సురేష్ రైనాతో కలిసి ఆసీస్ క్రీడాకారులకు చెమటలే పట్టించారు. దూకుడుగా ఆడుతున్న ధోనీని ఆసీస్ జట్టు 49.3వ ఓవర్ వద్ద జాన్సన్ బౌలింగ్ లో టి.పైన్ క్యాచ్ పట్టడం ద్వారా పెవిలియన్ కు పంపించగలిగింది. మరో రెండు బంతుల్లోనే సురేష్ రైనా కూడా ధోనీ మాదిరిగానే జాన్నస్ బౌలింగ్ లో పైన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ వద్దకు వచ్చిన హర్భజన్ సింగ్ ఒక్క పరుగు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ప్రవీణ్ కుమార్ ఒక్క బంతిని ఎదుర్కొని ఒక పరుగు చేసి రన్నౌట్ అయ్యాడు. దీనితో భారత్ ఇన్నింగ్స్ 354 పరుగులతో ముగిసింది. ఆస్ట్రేలియాపై వన్డేలో భారత్ చేసిన అత్యధిక స్కోరుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2001 మార్చిలో బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 315 పరుగులు చేసింది.
నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 354 పరుగులు చేసి ఆసీస్ కు పెద్ద విజయ లక్ష్యాన్నే నిర్దేశించింది. ఆసీస్ బౌలింగ్ లో మొత్తం 14 వైడ్ బాల్స్, 6 లెగ్ బైలు, ఒక బై, 2 నోబాల్స్ ఉన్నాయి. ఆసీస్ బౌలర్లలో మిట్చెల్ జాన్సన్ 3 వికెట్లను పడగొట్టాడు. బెన్ హిల్ఫెన్హాస్, పీటర్ సిడిల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Pages: -1- 2 News Posted: 28 October, 2009
|