కళ తప్పిన 'ఈడెన్'
నాలుగు టవర్లలో ఒక్కొక్కదానిలో 216 మెటల్ హాలైడ్ బల్బులు అమర్చారు. వాటికి విద్యుత్ సరఫరా సిఇఎస్ సి హై టెన్షన్ లైన్ల నుంచి జరుగుతుంది. ఈడెన్ లో గల లో టెన్షన్ ట్రాన్స్ మిటర్లు ఫ్లడ్ లైట్ల కోసం వోల్టేజిని 6000 వోల్టుల నుంచి 380-390 వోల్టులకు తగ్గిస్తాయి. 'నాలుగవ నంబర్ టవర్ లో వోల్టేజిలో ఏదో క్షణం పాటు తగ్గినట్లు కనిపిస్తున్నది' అని టవర్ లైట్ల ఇన్ చార్జి అయిన సిఎబి అధికారి సాధన్ ముఖర్జీ పేర్కొన్నారు. హైకోర్టు వైపు గల ఇ బ్లాకు సమీపంలోని నాలుగవ టవర్ లో వోల్టేజి 390 వోల్టుల నుంచి 370 వోల్టులకు పడిపోయిందని ముఖర్జీ తెలిపారు. 'రికార్డుల ద్వారా మేము దీనిని రుజువు చేయగలం' అని ఆయన చెప్పారు.
క్రికెట్ సంఘం ఇందుకు సిఇఎస్ సిని తప్పు పట్టగా మొత్తం మెయింటెనెన్స్ కు బాధ్యులైన పిడబ్ల్యుడి ఇంజనీర్లు టవర్ల నిర్వహణ నాసిగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. టవర్ల నిర్వహణ బాధ్యత సిఎబిది. 'టవర్ల నిర్వహణలో ఏదో లోపం ఉన్నట్లున్నది' అని మైదానంలో ఉన్న పిడబ్ల్యుడి శాఖ మంత్రి క్షితి గోస్వామి అన్నారు. లైట్లు ఆరిపోవడంతో పోలీసులు స్టేడియంలో జనం అలజడి లేవదీయకుండా చూసేందుకు బౌండరీ లైన్ వద్దకు చేరుకున్నారు. వీక్షకులు దాదాపు పది నిమిషాల సేపు ఓపికతో నిరీక్షించారు. కాని ఆ తరువాత వారిలో సహనం నశించింది. ఇక చాలా మంది భోజనం బాక్సుల కోసం క్యూ కట్టారు.
ఇండియా విజయం సాధించిన తరువాత ఒక కళాశాల విద్యార్థి అత్రి మిత్రా మైదానంలో నుంచి ఆనందంతో నిష్క్రమించాడు. కాని 'ఇటువంటి విద్యుత్ వైఫల్యాలు కొనసాగుతుంటే ఈడెన్ ను అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిర్ణయించరు' అని మిత్రా భయాందోళనలతో అన్నాడు. 'ఈడెన్ లోనే ఇలా ఎప్పుడూ ఎందుకు జరుగుతోంది' అని మరొక అభిమాని ప్రశ్నించాడు. మ్యాచ్ మధ్యలో వచ్చి 20 నిమిషాల సేపు చూసిన రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ఇందులో ఏదో కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. 'బెంగాల్ లో క్రికెట్ ను అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నమేమో ఇది' అని ఆమె అన్నారు. స్టేడియం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది సూచిక అని ఆమె అన్నారు.
కాగా, ఇది విద్రోహ చర్యేమో అనే విషయమై మాట్లాడడానికి సిఎబి అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా నిరాకరించారు. ఏడుగురు సభ్యులతో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ కూడా కమిటీలో ఒక సభ్యుడు.
Pages: -1- 2 News Posted: 25 December, 2009
|