దారి వేస్తున్న అఫ్రిదీ ఐపిఎల్ వేలంపాటలో పాకిస్తానీ క్రికెటర్లను నిర్లక్ష్యం చేయడంపై అలజడి రేగినప్పటికీ భారతీయ బోర్డుతో రాజీకి రావడానికి తాము సుముఖమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికార వర్గాలు ప్రకటించాయి. 'ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టరాదని మేము ఎప్పుడూ కోరుతున్నాం' అని పిసిబి అధికారి ఒకరు తెలిపారు. 'మా క్రీడాకారుల పట్ల సవ్యంగా, న్యాయంగా వ్యవహరించలేదని మోడి అంగీకరించి, తదుపరి సముచిత చర్యలు తీసుకునేటట్లయితే మేము కూడా తదనుగుణంగానే నడచుకుంటాం' అని మరొక అధికారి సూచించారు.
ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ ఆల్ రౌండర్ షహీద్ అఫ్రీదీ విడిగా ఒక ప్రకటన చేస్తూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాటలో 'అలక్ష్యం చేసినందుకు' కలిగిన ఆగ్రహం, బాధ నుంచి తాను బయటపడ్డానని, భవిష్యత్తులో ట్వంటీ20 టోర్నీలో ఆడేందుకు తాను సుముఖంగానే ఉన్నానని తెలియజేశాడు. తనకు అవకాశం లభించిన పక్షంలో మున్ముందు ఇండియాలో చాంపియన్స్ లీగ్ లేదా ఐపిఎల్ లో ఆడాలని ఆకాంక్షిస్తున్నానని కూడా అఫ్రీదీ తెలిపాడు.
Pages: -1- 2 News Posted: 26 January, 2010
|