టెస్ట్ జట్టులో కొత్త రక్తం
టీమిండియా సభ్యుల జాబితా దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ లో పాల్గొనే క్రీడాకారులకు సంబంధించినది మాత్రమే అని సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశారు. గాయాలు తగిలిన క్రీడాకారులకు సంబంధించిన ఫిట్ నెస్ రిపోర్టు వచ్చిన తరువాత రెండో మ్యాచ్ కు సంబంధించిన జట్టును ప్రకటిస్తామన్నారు. పదిహేను మంది భారత జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు పేస్ బౌలర్లు, ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేసినట్లు శ్రీకాంత్ వివరించారు. కెప్టెన్ ధోనీ, వృద్ధిమాన్ సాహ వికెట్ కీపర్లుగా వ్యవహరిస్తారు. స్పిన్ విభాగంలో హర్భజన్ సింగ్ ప్రధాన భూమిక పోషిస్తాడని, లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలు సహాయక పాత్ర పోషిస్తారని శ్రీకాంత్ తెలిపారు. పేస్ విభాగంలో ఇషాంత్ శర్మతో కలిసి జహీర్ ఖాన్ ముఖ్యపాత్ర వహిస్తాడన్నారు. మిథున్, త్యాగిలు ఇతర పేసర్లుగా ఉంటారు.
దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 6 - 10 తేదీల మధ్య నాగపూర్ లోను, 14 - 18 తేదీల మధ్య కోల్ కతాలోనూ రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. జైపూర్, కాన్పూర్, అహ్మదాబాద్ వేదికలుగా మూడు వన్డేల్లో కూడా భారత్ తో పోటీ పడుతుంది.
తొలి టెస్ట్ మ్యాచ్ కు భారత జట్టు :
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, మురళీ విజయ్, సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, ఎస్. బద్రీనాథ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, సుదీప్ త్యాగి, ప్రజ్ఞాన్ ఓజా, అభిమన్యు మిథున్, వృద్ధిమాన్ సాహ.
Pages: -1- 2 News Posted: 28 January, 2010
|