సైన్సు రంగంలోకి 'మహిళ' న్యూఢిల్లీ : సైన్స్ లో మహిళల పాత్రకు సంబంధించిన జాతీయ టాస్క్ ఫోర్స్ చేసిన కొత్త ప్రతిపాదనల కింద దేశ వ్యాప్తంగా గల ప్రభుత్వ సైన్స్, వైజ్ఞానిక సంస్థలు లింగ వివక్ష లేని కేంద్రాలుగా సర్టిఫికెట్లు పొందాలి. వైజ్ఞానిక సంస్థలలోమహిళలను రిక్రూట్ చేసుకునే సమయంలో అనుసరిస్తున్న కొన్ని అలిఖిత నిబంధనలకు స్వస్తి పలకాలని కూడా 14 మంది సభ్యులున్న ఈ ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కోరింది. జీవిత భాగస్వామిని ఒకే సంస్థలో నియమించకూడదనే నిబంధన వాటిలో ఒకటి.
కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ నాలుగు సంవత్సరాల క్రితం ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ చేసే సిఫార్సులు వివిధ ప్రభుత్వ సంస్థల అజమాయిషీలో ఉన్న 150 పైచిలుకు వైజ్ఞానికి లేబరేటరీలు, పరిశోధనా సంస్థలలో అమలు చేయాల్సి ఉంది. టాస్క్ ఫోర్స్ నివేదికను సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. లింగ వివక్ష రహిత వాతావరణం సృష్టికి కృషి చేసే సంస్థలకు ఒక 'సంస్థాగత పరివర్తన అవార్డు'ను ప్రవేశపెట్టాలని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికలో ప్రతిపాదించింది. 'ఏ సంస్థలలో లింగ వివక్ష లేదో, తదనుగుణమైన చర్యలు ఇంకా తీసుకోవలసిన సంస్థలు ఏవో సూచించేందుకు ఈ అవార్డులు ఉపయోగపడతాయి' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సైన్స్, టెక్నాలజీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
జీవిత భాగస్వామికి ఒకే సంస్థలో ఉద్యోగం ఇవ్వరాదన్న 'అలిఖిత ఆంక్ష'ను రద్దు చేయాలని టాస్క్ ఫోర్స్ కోరింది. జీవిత భాగస్వాములను రిక్రూట్ చేసుకోరాదన్న నిబంధన ఏదీ లేకపోయినప్పటికీ అటువంటి నియామకాన్ని 'నిరుత్సాహపరుస్తున్నార'ని బయోటెక్నాలజీ శాఖ అజమాయిషీలోని ఒక పరిశోధనా సంస్థకు చెందిన ఒక సైంటిస్ట్ తెలియజేశారు. 'ఇది జరిగినప్పుడు ప్రత్యామ్నాయ కెరీర్ కోసం ప్రయత్నించవలసింది ఎక్కువగా మహిళే అవుతున్నది' అని ఆ సైంటిస్ట్ పేర్కొన్నారు.
రిక్రూట్ మెంట్ ప్రక్రియలో పురుష అభ్యర్థులను అడగని తరహా వ్యక్తిగత, కుటుంబ సంబంధిత ప్రశ్నలను మహిళా అభ్యర్థులను అడగకుండా నిరోధించేందుకు ఒక నైతిక ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవలసిందిగా కూడా వైజ్ఞానిక శాఖలను టాస్క్ ఫోర్స్ కోరింది. 'పిల్లలను ఎవరు చూస్తారు లేదా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా వంటి ప్రశ్నలు వివక్షను సూచిస్తాయి' అని ఆ అధికారి పేర్కొన్నారు. అభ్యర్థి రూమ్ లో లేకపోయినప్పటికీ ఎంపిక బృందం అటువంటి విషయాలను ప్రస్తావించరాదని టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. మహిళా పరిశోధకులకు ఉద్యోగ పరిస్థితులను మెరుగుపరిచేందుకు క్రెష్ లు, క్యాంపస్ గృహవసతి, సురక్షిత రవాణా వంటి సౌకర్యాల కోసం తాను తొలుత చేసిన సూచనలను టాస్క్ ఫోర్స్ తిరిగి తన నివేదికలో పొందుపరిచింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రముఖ మహిళా సైంటిస్టులు, సైన్స్ పాలనాధికారులు కూడా ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 28 January, 2010
|