ఉద్యమానికి కాంగ్రెస్ నో! హైదరాబాద్ : తెలంగాణ అంశంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం వచ్చే వారం ఏర్పాటు చేయనున్నందున ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ఉద్యమాన్ని నిలిపివేయాలని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఉద్యమాన్ని 'ప్రస్తుతానికి' నిలుపుదల చేయాలన్న ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించడానికై కాంగ్రెస్ శాసనసభ్యులు శనివారం హైదరాబాద్ లో సమావేశం కాగలరని సీనియర్ నాయకుడు ఒకరు తెలియజేశారు.
ప్రతిపాదిత కమిటీపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం వివరణ ఇచ్చిన దృష్ట్యాను, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధితో సమావేశమైన దృష్ట్యాను స్పీకర్ కు అందజేసిన తమ రాజీనామా లేఖలను ఉపసంహరించుకోవాలని శాసనసభ్యులను కోరడానికి పార్టీ నాయకులు నిశ్చయించినట్లు ఆ నాయకుడు తెలిపారు.తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో కూడా వారు పాల్గొనరు. 'అయితే, మేము జెఎసి నుంచి తప్పుకోం' అని ఆయన చెప్పారు. రాజీనామాల ఉపసంహరణ ద్వారా రాష్ట్రంలో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొనేందుకు దోహదం చేయవలసిందిగా గురువారం తనతో భేటీ అయిన నలుగురు తెలంగాణ నాయకులకు సోనియా గాంధి సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 30 January, 2010
|