టాలీవుడ్ 'క్రైమ్' కథలు!
నిర్మాత ఎస్.జె.బషీద్ పై ఫోర్జరీ నేరం కింద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. బ్యాంకు రుణం కోసం ఒక కార్డియాలజిస్ట్ భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన అభియోగంపై బషీద్ ను అప్పట్లో అరెస్టు చేశారు. స్థలం అమ్మకానికి సంబంధించి పత్రికలో వచ్చిన అడ్వర్ టైజ్ మెంట్ చూసిన బషీద్ కార్డియాలజిస్ట్ దంపతులను కలుసుకున్నారనీ, సదరు ప్లాట్ డాక్యుమెంట్ కాపీలు తీసుకుని ఆమె సంతాకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారనీ పోలీసులు చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో చీటింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. మరో నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ సైతం నకిలీ కరెన్సీ సర్క్యులేషన్ కేసును ఎదుర్కొంటున్నారు. అందరి కంటే ఎక్కువగా నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కనీసం ఐదు చీటింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నిర్మాతపైనే కొద్దికాలం క్రితం హీరో బాలకృష్ణ తన నివాసంలో కొంత వాగ్వాదం తర్వాత తుపాకీతో కాల్పులు జరిపారు.
టాలీవుడ్ లో నేరపూరిత సంఘటనలు చోటుచేసుకుంటున్న వైనంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి తనదైన శైలిలో విశ్లేషించారు. ఏటా నిర్మాతలు 120 చిత్రాల వరకూ తెలుగులో నిర్మిస్తున్నారనీ, అయితే వీటిలో రెగ్యులర్ నిర్మాతలు తీసేవి ఐదారు సినిమాలు మాత్రమేననీ ఆయన అన్నారు. 'చాలా మంది నిర్మాతలు ఎవరనేది కానీ, వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటనేది కానీ ఎవరికీ తెలియదు. వాళ్లు వస్తుంటారు. పోతుంటారు. ఇందుకు కారణం...వీళ్లు తీసిన 90 శాతం సినిమాలు ఫెయిలవుతుంటాయి. ఫైనాన్సియర్ ఎక్కువ వడ్డీ రేట్లు ఆశించడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కూడా కష్టమవుతుంటుంది. అయితే ఎక్కడో ఏదో జరిగిందని మొత్తం పరిశ్రమను తప్పుపట్టడం కూడా సబబు కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 27 February, 2010
|