పని కల్పించండి: కలెక్టర్
కాకినాడ : జిల్లాలో 53 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన దృష్య్టా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు చేపట్టి అడిగిన వారందరికీ పనులు కల్పించాలని కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. నిబంధనలను పాటిస్తూ అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టి సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. ఉపాధి పనుల నిర్వహణలో ఎండీఓ, ఏపీఓలు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులు పంచాయితీల్లో, మండలాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్కడైనా నిధుల కొరత ఉంటే ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రత్యేకాధికారులకు సూచించారు.
జిల్లా రైతాంగంలో 50 శాతం కౌలు రైతులేనని, వారిని జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా ఏర్పాటు చేసి బ్యాంక్ రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని, పశువులకు తాగునీటి కోసం అవసరమైన రోట నీటి తొట్టెల ఏర్పాటుకు అంచనాలను సిద్ధం చేయాలని పశుసంవర్థక శాఖాధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులు పూర్తయినందున డెల్టా మమండలాల్లో కూడా పనులుచేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యంపై కలెక్టర్ మాట్లాడుతూ నయం చేయగలిగిన జబ్బులై ఉండి కూడా కొంతమంది అక్కడక్కడ మరమిస్తున్నారని, అలా జరగకుండా ఉండాలంటే వెంటనే తగు వైద్య సేవలు అందించాలన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ బెన్నెట్ క్లబ్ లోకరువు పరిస్థితులపై మండల ప్రత్యేకాధికులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈ సమావేశంలో డీఆర్ డీఏపీడీ బి.రామారావు, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
News Posted: 11 September, 2009
|