వరల్డ్ కప్ కూ 'టెర్రర్'
ముంబాయి: క్రికెట్ మీద టెర్రరిజం నీడలు మరోసారి ముసురుకున్నాయి.లాహోర్ లో జరిగిన దాడి ప్రభావం పాకిస్తాన్ సరహద్దులు దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దాడి తక్షణ ఫలితం కనిపించేది మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపిఎల్ టోర్నమెంట్ పైన, 2011 క్రికెట్ వరల్డ్ కప్ పైన. ఈ రెండు టోర్నమెంట్లు నిర్వహించేది సంయుక్తంగా కాని, మరోలా కాని, భారతదేశం. లాహోర్ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ), ఐపిఎల్ నిర్వాహకులు ఈ పోటీలు ముందుగా నిర్ణయించిన విధంగానే ఎలా జరపాలా అని బుర్రలు బద్దలుగొట్టు కోవడం ప్రారంభించారు. టోర్నమెంట్ వాయిదా వేసుకోవాలని హోం మంత్రి చిదంబరం చేసిన సూచన ఐపిఎల్ నిర్వాహకులను గందరగోళంలో పడేసింది. అయితే పోలింగు తేదీల రోజున జరగాల్సిన మ్యాచ్ లను వాయిదా వేసుకంటామని ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇంకా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవలసి వుంది. వాస్తవానికి, వచ్చే 12 నెలల్లో ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా వున్న అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ను పరిశీలిస్తే ఐపిఎల్ ను పూర్తిగా వాయిదా వేయడం సాధ్యం కాదు.
తొలుత నిర్ణయించిన ప్రకారం ఐపిఎల్ టోర్నీ ముగిసిన తరువాత, జూన్ 5 నుండి ఇంగ్లండ్ లో ట్వంటీ20 వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కావలసి వుంది. ఇక 2011లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించవలసి వున్న వరల్డ్ కప్ సమస్యలు వేరు. ఐసిసికి వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ, లాహోర్ దాడి పాకిస్తాన్ ను పోటీల నిర్వహణ బాధ్యత నుంచి పూర్తిగా తప్పించేసింది. ఈ టోర్నీని ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో నిర్వహించాలా లేక ఉప ఖండంనుంచి వేరే ప్రాంతానికి మార్చాలా అన్న విషయాన్ని ఐసిసి, వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించాలి. ఎటువంటి నిర్ణయానికైనా ఐసిసి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదముద్ర విధిగా కావాలి. బోర్డు సమావేశం ఏప్రిల్ 11న జరగవలసి వుంది. కాని వరల్డ్ కప్ నిర్ణయాన్ని మాత్రం అంతవరకూ వాయిదా వేయడానికి వీల్లేదు.
Pages: 1 -2- News Posted: 4 March, 2009
|