సచిన్ సూపర్బ్ : ధోని
క్రైస్ట్ చర్చ్: మూడో వన్డేలో అద్భుతమైన షాట్లతో కళ్లు మిరుమిట్లు గొలిపి తన సత్తా మరోసారి రుజువు చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్, లిటిల మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను భారత జట్టు కెప్టెన్ ఆకాశానికెత్తేశాడు. మరోవైపు, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరిలో జాడించిన తోకను కత్తిరించడంలో బౌలర్లు విఫలమయ్యారని ఆక్రోశించాడు. ఆదివారం టీమ్ ఇండియా సాధించిన విజయంపై అతడు వ్యాఖ్యానిస్తూ 'ఫామ్ లో ఉన్న యువరాజ్ సింగ్ ను నిలువరించడం ఎవరివల్లా సాధ్యం కాదు. అటు సచిన్, ఇటు యువరాజ్ డుతున్న షాట్లు చూస్తుంటే స్కోరు 390 పరుగులు దాటుతుందని అనుకున్నాం' అన్నాడు. తనకు బ్యాట్స్ మెన్ మీద పూర్తి విశ్వాసం ఉందని, అందువల్లనే ఒక్కోసారి ఒక బౌలర్ తక్కువైనా ధైర్యంగా బరిలో అడుగు పెట్టగలుగుతన్నానని చెప్పాడు. బ్యాటింగే భారత జట్టుకు పూర్తి బలమన్నాడు.
'ఓక్కోసారి మనకు ఒక బౌలర్ తక్కువైనప్పటికీ, ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగే బ్యాట్స్ మెన్ ఉన్నారు. నలుగురు మెయిన్ బౌలర్లు, కొద్దిమంది పార్ట్ టైం బౌలర్లతో కూడా ప్రత్యర్ధిపై ఒత్తిడి కలుగజేయడానికి బ్యాటింగ్ బలమే కారణమ'ని ధోని అన్నాడు. ఆదివారం మ్యాచ్ నుంచి గ్రహించవలసిందల్లా టెయిల్ ఎండ్ బ్యాట్స్ మెన్ ను వీలైనంత వేగంగా ఔట్ చేయవలసిందేనని, చేసిన ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకుంటున్నామని ధోని అన్నాడు. ఆదివారం మ్యాచ్ లో టిమ్ సౌదీ, కైల్ మిల్స్ తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి 83 పరుగులు జోడించి ఆట ఫలితాన్ని వెలక్కు జరిపిన విషయం తెలిసిందే.
Pages: 1 -2- News Posted: 9 March, 2009
|