కొత్త షెడ్యూలు కోరిన హోం
న్యూఢిల్లీ: ఐపిఎల్ రెండో సీజన్ కు మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. లీగ్ పోటీలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని దాదాపు అన్ని రాష్ట్రాలు చెప్పడంతో మ్యాచ్ ల తేదీలను మళ్లీ షెడ్యూలు చేయాలని నిర్వాహకులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపిఎల్ ప్రచిపాదించిన తేదీల్లో పారా మిలిటరీ దళాలను సమకూర్చడానికి అనేక రాష్ట్రాలు తిరస్కరించాయి. దీనితో ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఈ యేడాది మ్యాచ్ లకు కొత్త తేదీలను నిర్ణయించి, ఆయా రాష్ట్రాల అంగీకారం పొందవలసి ఉందని హోం శాఖ తాజా తాఖీదు స్పష్టం చేస్తోంది. వచ్చే నెల ఐపిఎల్ పోటీలు జరగవలసి వున్న వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులతో హోం శాఖ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లతో సహా ఏడు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా సంప్రదింపులు జరిపారు.
అదనపు పారా మిలిటరీ దళాలను ఇస్తే తప్ప ఐపిఎల్ పోటీలకు భద్రత గ్యారంటీ ఇవ్వలేమని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు స్పష్టంగా చెప్పాయి. ఆ తరువాత హోం శాఖ 90 నిముషాల సేపు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కేంద్రం నుండి అదనపు బలగాలు వస్తే తప్ప ట్వంటీ పోటీలు నిర్వహించడం సాధ్యం కాదని ఆ రాష్ట్రాలు మళ్లీ చెప్పాయి. ఈ రాష్ట్రాల అభిప్రాయాలను మధుకర్ గుప్తా హోం మంత్రి చిదంబరానికి తెలియజేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ఎంకె నారాయణన్, గూఢచారి సంస్థ 'రా' ప్రధానాధికారి హోం మంత్రి చిదంబరం, కార్యదర్శి మధుకర్ గుప్తా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|