ఐపిఎల్ నాలుగు స్తంభాలాట!
ముంబాయి: ఇండియాలో జరిగే క్రికెట్ పోటీలకు ఆయా రాష్ట్రాల భద్రతా దళాలను వినియోగించడమే ఆనవాయితీ. ఇంతవరకూ ఏ అంతర్జాతీయ పోటీకి కేంద్ర రక్షణ దళాలు భద్రత కల్పించలేదు. అందువల్ల ఐపిఎల్ మ్యాచ్ లకు కేంద్ర భద్రతా దళాలను ఇవ్వలేనని హోం మంత్రి చిదంబరం చెప్పినప్పుడు అంతగా ఆందోళన చెందని లీగ్ కమిషనర్ లలిత్ మోడికి ఇప్పుడు బెంగ పట్టుకుంది. ఎన్నికల విధుల నుంచి భద్రతా సిబ్బందిని క్రికెట్ మ్యాచ్ లకు మరల్చడం సాధ్యం కాదని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పడంతో టోర్నమెంట్ కు ముప్పు ఏర్పడింది. హోం శాఖ అధికారులతో తాజాగా చర్చలు జరపడానికి మోడి హుటా హుటిన ఢిల్లీ వెళ్లారు. టోర్నమెంట్ కు ప్రైవేటు, విదేశీ సంస్థల భద్రతా ఏర్పాట్లు చేసుకుంటామని నిర్వాహకులు గొప్పగా చెప్పుకున్నా, ఆ నిపుణులు సలహాలైతే ఇవ్వగలరు తప్ప అవసరమైనంత మంది సిబ్బందిని తీసుకు రాలేరు కదా!
తాము సవరించిన షెడ్యూలును సమర్పిస్తామని, వివరాలు వెల్లడించకుండా, మోడి చెప్పారు. టోర్నమెంటును ఎలాగైనా కాపాడాలని ఆయన, సహచరులు తాపత్రయ పడుతున్నారు. ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ 10 నుంచి మే 25 వరకూ పోటీలు జరుగుతాయంటున్నారు. కాకపోతే మొత్తం 59 మ్యాచ్ లను 10 నగరాల్లో, 45 రోజుల్లో ఎలా నిర్వహించగలరన్నదే ప్రశ్న. రోజుకు జరిగే మ్యాచ్ ల సంఖ్య పెంచాలా? నగరాల సంఖ్యను పదికి మించి పెంచాలా? అన్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి. లేదా కేవలం భద్రతా ఏర్పాట్లకు అనుమతి గల నగరాలలో మాత్రమే పోటీలు నిర్వహించడం మరో ప్రత్యామ్నాయం.
Pages: 1 -2- News Posted: 14 March, 2009
|