ఐపిఎల్ 'బుల్లెట్ ప్రూఫ్'!
న్యూడిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)రెండో సీజన్ లో ఆటగాళ్లు, అధికారుల ప్రయాణాలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. మొత్తం 64 బుల్లెట్ ప్రూఫ్ కార్లు, 16 బుల్లెట్ ప్రూఫ్ బస్సుల తయారీకోసం లూధియానాకు చెందిన లాగర్ ఇండస్ట్రీస్ కు కాంట్రాక్టు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కాని, కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ వాహనాలను సప్లై చెయ్యడానికి గడువు మాత్రం 15 రోజులే ఇచ్చారట! 'బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చాలని మాకు అందిన సిఫార్సుల్లో ఉంది. వాటిని పరిశీలిస్తున్నాం. వాహనాలను గడువులోగా ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాం' అని ఐపిఎల్ సీనియర్ అదికారి ఒకరు చెప్పారు. కాకపోతే ఇంత భారీ ఆర్డర్ ను స్వీకరించడానికి లాగర్ కంపెనీకి ఎదురయ్యే సమస్య ఒక్కటే! తగినంత వ్యవధి లేకపోవడం.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సాధ్యమైనంత త్వరలో సమకూర్చుకోవాలని ఐపిఎల్ నిర్వాహకులు హడావిడి పడుతుండగా, లాగర్ కంపెనీ మాత్రం చేతులెత్తేసింది. కనీసం ఐదు నెలల వ్వవధి కావాలంటోంది. ఈ ఆర్డర్ తో ఐపిఎల్ యాజమాన్యం గతవారం తమ వద్దకు వచ్చిందని, వ్యవధి చాలా తక్కువ ఇచ్చినందువల్ల తాము కాంట్రాక్టుకు సమ్మతించ లేదని లాగర్ ఇండస్ట్రీస్ డైరక్టర్ సంచిత్ సోబ్తి చెప్పారు. 'ఈ వియమై ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఒక వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ గా తయారుచేయడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. కాని వాళ్లేమో 64 బుల్లెట్ ప్రూఫ్ కార్లు, 16 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పదిహేను రోజుల్లో తయారు చేయమంటున్నారు. ఈ ఆర్డర్ ను పరిపూర్ణంగా పూర్తి చేయడానికి కనీసం ఐదు నెలల వ్యవధి కావాలి. తొందరపడి ప్రమాణాలకు తిలోదకాలిచ్చేస్తే అందరి పరువులు పోతాయి' అన్నారాయన.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|