ఐపిఎల్ ఛాన్స్ ఎలా దక్కింది?
ముంబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) పోటీలను నిర్వహించడానికి ఇంత తక్కువ వ్యవధిలో సిద్ధం కాగలరా? అని క్రికెట్ దక్షిణాఫ్రికా సిఇఓ జెరాల్డ్ మజోలాను లలిత్ మోడీ గత శనివారం రాత్రి అడిగినప్పుడు, ఆయన జవాబు చెప్పడానికే ఒక రోజు గడువు అడిగారు. 'సిద్ధమే'అని ఇరవై నాలుగ్గంటలు తిరక్కుండానే జవాబిచ్చారు. ఐపిఎల్ నిర్వహించే అవకాశం వదలుకోకూడదని యావత్ దక్షిణాఫ్రికా క్రికెట్ రంగం ఒక్క తాటిపై నడుస్తూ పోటీలకు ముక్తకంఠంతో ఆహ్వానం పలికింది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) నుండి ఇటువంటి సానుకూలమైన సమాధానం రాలేదు. ఐపిఎల్ పోటీలను నిర్వహించాలని ఇసిబి అధికారులు ఆసక్తి కనబరచినప్పటికీ, మన రాష్ట్రాల మాదిరిగానే, అక్కడి కౌంటీల నుంచి 24 గంటల్లో అనుకూల సమాధానం రాబట్టడం అస్సలు సాధ్యం కాదు.
అందుకు విరుద్ధంగా- 'మేమందరం జనరల్ మజోలాకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఐపిఎల్ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం గురించి ఆయన చెప్పినప్పుడు, ఆ అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని చెబుతూ అన్ని రాష్ట్రాలు ఆయనకు సంపూర్ణాధికారాలను ఇచ్చేశాయి. ఈవిషయంలో రెండో అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదు' అని చెప్పారు డర్బాన్ లోని క్వాజులు నేటల్ క్రికెట్ యూనియన్ సిఇఓ కేసిన్ డొక్రాట్. ఎప్పుడైతే అన్ని రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందో, లలిత్ మోడీని తమ దేశం వైపు ఆకర్షించడానికి మజోలా చేయని ప్రయత్నమంటూ లేదు. ఆ సమయంలో ఇసిబి నిర్ణేతలు గైల్స్ క్లార్క్(చైర్మన్), డేవిడ్ కాలియర్(సిఇఓ) లండన్ లో లేకపోవడం దక్షిణాప్రికాకు బాగా కలిసివచ్చింది. దానికి, ఐపిఎల్ గురించి తమను సంప్రదించలేదన్న లండన్ పోలీసుల ప్రకటన తోడయింది.
Pages: 1 -2- News Posted: 25 March, 2009
|