18 నుంచి ఐపిఎల్ టోర్నీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2009 టోర్నీ కొత్త షెడ్యూల్ ను శుక్రవారం ప్రకటించారు. దీని ప్రకారం, టోర్నీ ఏప్రిల్ 18న కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో మొదలవుతుంది. ఫైనల్ మే 24న జోహాన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియంలో జరుగుతుంది. సెమీ ఫైనల్స్ ను మే 22, 23 తేదీలలో ప్రిటోరియా, జోహాన్నెస్ బర్గ్ లలో నిర్వహిస్తారు. తొలి రోజు రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఒక మ్యాచ్ లో నిరుటి విజేత రాజస్థాన్ రాయల్స్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్, బెంగళూరు జట్టును ఢీకొంటుండగా రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు నిరుటి రన్నర్సప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది.
మొత్తం ఎనిమిది నగరాలలో 59 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఆ నగరాలు - కేప్ టౌన్, జోహాన్నెస్ బర్గ్, డర్బన్, ప్రిటోరియా, ఈస్ట్ లండన్, కింబర్లీ, బ్లోమ్ ఫోంటైన్, పోర్ట్ ఎలిజబెత్. దక్షిణాసియా వారు అధిక సంఖ్యలో నివసించే డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలోనే ఎక్కువగా 16 పోటీలు జరుగుతాయి. ఆతరువాత 12 పోటీలకు ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్ ఆతిథ్యం ఇస్తుంది. జోహాన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియంలోను, కేప్ టౌన్ న్యూలాండ్స్ లోను ఎనిమిదేసి మ్యాచ్ లు జరుగుతాయి.
వీటిలో నాలుగింటికి న్యూలాండ్స్ టోర్నీ తొలి రెండు రోజులలో ఆతిథ్యం ఇస్తుంది. పోర్ట్ ఎలిజబెత్ లోని సెయింట్ జార్జిస్ పార్క్ కు ఏడు పోటీలు, ఈస్ట్ లండన్ లోని బఫెలో పార్క్ కు నాలుగు పోటీలు కేటాయించారు. బ్లోమ్ ఫోంటైన్ లోని ఔట్ సూరెన్స్ లోను, కింబర్లీలోని డి బీర్స్ ఓవల్ లోను రెండేసి మ్యాచ్ లు నిర్వహిస్తారు.
Pages: 1 -2- News Posted: 27 March, 2009
|