పరువు నిలిపిన 'టెయిల్'
వెల్లింగ్టన్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(52), స్పిన్నర్ హర్భజన్ సింగ్(60) కివీస్ బౌలర్లకి ఎదురుతిరిగి చేసిన అర్ధ సెంచరీలు, చివరి సెషన్ లో జహీర్ ఖాన్(33) నిబ్బరంగా చేసిన స్కోరు, న్యూజిలాండ్ తో ఇక్కడి బేసిన్ రిజర్వ్ స్టేడియంలో ప్రారంభమైన మూడో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు ఆటలో భారత జట్టు పటిష్టమైన స్కోరు సాధించడానికి ప్రధానంగా తోడ్పడ్డాయి. తొంభై ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగుల మొదటి ఇన్నంగ్స్ స్కోరు వద్ద ఆట ముగిసిన సమయానికి ఇషాంత్ శర్మ 15, మునాఫ్ పటేల్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ పదో వికెట్ భాగస్వామ్యానికి నాలుగు ఓవర్లలో 28 పరుగులు జోడించారు. టీ విరామ సమయం తరువాత జరిగిన రెండు గంటల ఆటలో భారత బ్యాట్స్ మెన్ 185 పరుగులు సాధించగలిగారు. మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోయాక(204/6), భారత జట్టు ఇంతకుముందెన్నడూ ఒక్కరోజు ఆటలో సాధించలేని రికార్డుస్థాయి స్కోరు నమోదు కావడం మరో విశేషం.
న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాక, వీరేందర్ సెహ్వాగ్ తన సహజ ధోరణిలో దూకుడుగా ాడడం ప్రారంభించాడు. మొదటి డ్రింక్స్ బ్రేక్ తరువాత కొద్ది సేపటికి సెహ్వాగ్(48-51 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్సర్) ఓ బ్రియన్ వేసిన బంతిని వికెట్ కీపర్ మెకల్లమ్ చేతుల్లో పడేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తరువాత ఓవర్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. నేపియర్ సెంచరీ వీరుడు గంభీర్ 23 పరుగులకే ఫ్రాంక్లిన్ బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. టెండుల్కర్, ద్రవిడ్ లంచ్ స్కోరును 101 పరుగుల వరకూ తీసుకు వెళ్లారు. లంచి తరువాత టెండుల్కర్ మరోసారి విజృంభించి 67 బంతుల్లో తన 53వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత మరో 12 పరుగులకే అతడు ఔటయ్యాడు.
Pages: 1 -2- News Posted: 3 April, 2009
|