వార్న్'రాయల్స్' భంగపాటు
కేప్ టౌన్: కెవిన్ పీటర్సన్ నాయకత్వంలోని బెంగుళూర్ రాయల్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. ఐపిఎల్ రెండో సీజన్ టోర్నీ తొలిరోజు రెండో మ్యాచ్ లో 75 పరుగుల తేడాతో వారన్ జట్టును చిత్తుగా ఓడించింది. బెంగుళూరుకే చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లిద్దరు బ్యాటింగ్, బౌలింగ్ లో విజృంభించడం, ట్వంటీ గేమ్ కు పనికిరారన్న వాదంతో భారతజట్టులో స్థానం సంపాదించలేక పోయినవారే ఈ మ్యాచ్ లో బెంగుళూరు జట్టును ఆదుకోవడం విశేషం. 'ది వాల్' ద్రవిడ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అనిల్ కుంబ్లె 3.1 ఓవర్లలో కేవలం 6 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రవీణ్ కుమార్, జెస్సీ రైడర్ లైన్, లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ చేయడంతో 134 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం రాజస్థాన్ జట్టుకు ఎంతమాత్రం సాధ్యం కాలేదు.
పది ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ జట్టు 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మరో 20 పరుగుల తర్వాత ఆలౌట్ అయిపోయింది. యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, టైరాన్ హెండర్సన్ మాత్రమే రెండంకెల స్కోర్లు(ఓక్కొక్కరు 11 పరుగులు) చేయగలిగారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగు ప్రారంభించిన బెంగుళూర్ జట్టులో ఓ వైపు వికెట్లు వరసగా పడిపోతుండగా, మరోవైపు ద్రవిడ్ నిబ్బరంగా ఆడుతూ 48 బంతుల్లో 66 పరుగులు చేసి, మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 133 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. జట్టు యజమాని విజయ్ మాల్య కెప్టెన్ హోదాను తప్పించినా పట్టించుకోకుండా చిరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేశాడు ద్రవిడ్.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|