బాలీవుడ్ లేని ఐపిఎల్ ఫైనల్
జోహాన్నెస్ బర్గ్ : బాలీవుడ్ ప్రముఖులు నిష్క్రమిస్తే దక్షిణాఫ్రికా గాయకులు రంగ ప్రవేశం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఆదివారం (24న) జోహాన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ల ప్రదర్శన ఉండదు. మల్టీప్లెక్స్ యజమానులు, బాలీవుడ్ నిర్మాతల మధ్య ఆదాయం పంపకానికి సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన ఇందుకు కారణం.
అక్కీ (అక్షయ్ కుమార్), బెబో (కరీనా కపూర్) నటించిన 'కంబఖ్త్ ఇష్క్' చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న సందర్భంగా వారిద్దరు చిత్రం కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. కాని మల్టీప్లెక్స్ ప్రతిష్టంభన వల్ల చిత్రం విడుదల వాయిదా పడింది. చిత్రం జూన్ ద్వితీయార్ధంలోగా థియేటర్లలో విడుదల కాకపోవచ్చు. అందువల్ల వాండరర్స్ స్టేడియంలో 24న వారి ప్రదర్శనను రద్దు చేశారు.
'యునైటెడ్ ప్రొడ్యూసర్ - డిస్ట్రిబ్యూటర్ ఫోరమ్ మార్గదర్శక సూత్రాల ప్రకారం, సమ్మె ముగియనిదే మేము చిత్రానికి ప్రచారం నిర్వహించలేము, సంగీత ఆడియోనూ విడుదల చేయలేము. అందువల్ల ఐపిఎల్ ఫైనల్ సందర్భంగా మా ప్రదర్శనను రద్దు చేసుకోవడం తప్ప మాకు మార్గాంతరం లేకపోతున్నది' అని 'కంబఖ్త్ ఇష్క' చిత్రం నిర్మాత సాజిద్ నాడియాడ్ వాలా ముంబై నుంచి తెలియజేశారు.
క్రితం సంవత్సరం మొదటి ఐపిఎల్ లో ప్రారంభ, ముగింపు వేడుకలలో బాలీవుడ్ ప్రధాన పాత్ర పోషించింది. సమీరారెడ్డి, దియా మీర్జా, అమృతా అరోరా, షమితా శెట్టి ప్రారంభ వేడుకలలో ప్రదర్శనలు ఇచ్చారు. ముంబైలో ముగింపు ఉత్సవంలో సల్మాన్ ఖాన్ నృత్యం చేశారు. టివిలో తన 'దస్ కా దమ్' షో కోసం ప్రచారం చేస్తున్నట్లుగా సల్మాన్ ఆ ప్రదర్శన ఇచ్చారు. అయితే, వచ్చే ఆదివారం (24న) స్థానిక కళాకారులు స్టేడియంలోని వీక్షకులను రంజింపచేయనున్నారు.
Pages: 1 -2- News Posted: 22 May, 2009
|