టీమిండియాలో లుకలుకలు
నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల మధ్య పొరపొచ్చలు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. సోమవారం టీమిండియా ప్రాక్టీస్ సేషన్‌కు వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ డుమ్మా కొట్టడంతో ఇది మరింత బలపడింది. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్ ధోనీ, అతని డిప్యూటీ సెహ్వాగ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో కంగుతిన్న సారథి తమ మధ్య అటువంటిదేమీ లేదని నిరూపించేందుకు జట్టు సభ్యులతో మీడియా ముందు హాజరయ్యాడు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని, తమ మధ్య ఎటువంటి మనస్పర్థాలు లేవని స్పష్టం చేశాడు. అయితే ఫిట్‌నెస్ కారణాలతో ధోనీ కావాలనే సెహ్వాగ్‌ను పక్కన బెట్టాడనే విమర్శలు ఇప్పటికీ వినవస్తున్నాయి.
ఆదివారం జరిగిన ఓ ప్రైవేటు విందుకు జట్టు సభ్యులతో కలిసి హాజరైన సెహ్వాగ్ సోమవారం జట్టు సాధనకు మాత్రం దూరంగా ఉన్నాడు. అతనితోపాటు సహచరులు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మలు కూడా ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. దీంతో జట్టులోని లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యా యి. ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో టీమిండియాలో నెలకొన్న విభేదాలు జట్టుపై ఎటువంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఇదేమీ పట్టించుకొని ఆటగాళ్లు తమ పంథాను విడువక ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు సైతం అంటున్నారు.
Pages: 1 -2- News Posted: 8 June, 2009
|