అభిమానులకు ధోని క్షమాపణ
లండన్ : ఆదివారం ఐసిసి ప్రపంచ ట్వంటీ20 చాంపియన్ షిప్ మ్యాచ్ లో ఓటమితో ఇంటి ముఖం పట్టవలసి వచ్చినందుకు భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోన్ భారత క్రికెట్ అభిమానులకు క్షమాపణ తెలియజేశాడు. మరీ అతిగా పోటీలు ఆడడం వల్ల కలిగిన అలసటే తమ అగ్ర శ్రేణి బ్యాట్స్ మన్ ల వైఫల్యానికి కారణమనే వాదనను ధోని తోసిపుచ్చాడు. 'జరిగిన దానికి మేము విచారిస్తున్నాం. అయితే, మేము శక్తివంచన లేకుండా కృషి చేశామని చెప్పగలం' అని ధోని విలేఖరుల గోష్ఠిలో పేర్కొన్నాడు. ఆదివారం లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో వేలాది మంది భారతీయ అభిమానుల ముందు ఇంగ్లండ్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం ధోని విలేకరుల గోష్ఠిలో మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మితిమీరిన మ్యాచ్ లు ఆడడం వల్ల భారత క్రీడాకారులు అలసిపోయారని విలేఖరుల గోష్ఠిలో వినవచ్చిన వాదనను ధోని ఖండించాడు. 'ఇందుకు అలసట కారణంగా పేర్కొనరాదు. ఇది సాకు కాదు' అని కెప్టెన్ అన్నాడు. ఎక్కువ పోటీలు ఆడడం క్రీడాకారులకే మంచిదని అతను పేర్కొన్నాడు. 'వేర్వేరు ప్రదేశాలలో ఆడవలసి రావడం వల్ల ఇది శ్రమకు గురి చేసే విధానమే. ఇది ఒకే చోట మూడు నాలుగు గేములు ఆడడం వంటిది కాదు' అని ధోని పేర్కొన్నాడు.
'మీరు నన్నుచూసి అతను నూటికి నూరు శాతం కృషి చేయడం లేదని అంటే నన్ను బాధ్యుడిని చేయండి. అయితే, బాగా ఆడడమనేది వేరే విషయం' అని అతను అన్నాడు. 'మేము నిజంగా ఒక బృందంగా బాగా ఆడలేదు' అని ధోని చెప్పాడు.
అయితే, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను బాగా రాణించలేకపోతున్నట్లు ధోని అంగీకరించాడు. అతను ఆదివారం 30 పరుగులు స్కోరు చేయగా అందులో మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఒక్క సిక్సర్ కూడా లేదు. ధాటీగా ఆడతాడనే పేరుకు విరుద్ధంగా అతను ఈ మ్యాచ్ లో నింపాదిగా బ్యాట్ చేశాడు. 'నేను సిక్సర్లు కొట్టడం లేకపోతున్నాను. అది నిజం. నేను ఆ విషయంలో బాగా కష్టపడుతున్నాను. నేను తిరిగి సిక్సర్లు కొట్టగలనని ఆశిస్తున్నాను' అని ధోని చెప్పాడు.
ఈ వికెట్ పై ఆడడం లైట్ల వెలుగులో 'మరింత మెరుగ్గా' ఉంటుంది కనుక టాస్ గెలిచిన తరువాత తాను మొదట ఫీల్డింగ్ ను ఎంచుకున్నానని ధోని తెలిపాడు.
అతను ఇంగ్లండ్ పేస్ బౌలర్ల బృందాన్ని కొనియాడాడు. వారు ఒక పథకం ప్రకారం భారత బ్యాట్స్ మన్ లకు షార్ట్ పిచ్ తో భుజం ఎత్తుకు బంతులను వరుసగా బౌల్ చేశారని అతను పేర్కొన్నాడు. 'వారి బౌలర్లు బాగా బౌల్ చేశారు. వారు దూకుడుతత్వం ప్రదర్శించారు. బౌన్సర్లను, షార్ట్ బంతులను చక్కగా ఉపయోగించుకున్నారు. వారు నిజంగా బౌన్సర్లను బాగా బౌల్ చేశారు. వారు షార్ట్ బంతులను ఉపయోగించుకున్నారు. వాటిని స్లో బౌన్సర్లతో మిళితం చేశారు. దీని నుంచి నేను నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఈ విషయంలో కృషి చేయగలమని ఆశిస్తున్నాను' అని అతను చెప్పాడు.
Pages: 1 -2- News Posted: 15 June, 2009
|