విండీస్ టూర్ కు భారత జట్టు
న్యూఢిల్లీ : వెస్టిండీస్ లో జరిగే వన్డే సీరీస్ పర్యటనకు వెళ్ళనున్న భారత క్రికెట్ జట్టును సెలెక్షన్ బోర్డు బుధవారం ప్రకటించింది. మొత్తం 16 మంది సభ్యులున్న ఈ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ లకు విశ్రాంతి ఇచ్చారు. కాగా, నాలుగేళ్ళ అనంతరం ఆశిష్ నెహ్రా తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ నెల 26 నుంచి ఈ వన్డే అంతర్జాతీయ సీరీస్ ప్రారంభం అవుతుంది. బొటన వేలికి గాయం కారణంగా సురేష్ రైనాకు కూడా జట్టులో స్థానం కల్పించలేదని బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ మీడియాకు తెలిపారు.
మొత్తం నాలుగు అంతర్జాతీయ వన్డే పోటీలు జరిగే ఈ సీరీస్ లో భారత జట్టు తరఫున ఆడేందుకు ఢిల్లీకి చెందిన ఆశిష్ నెహ్రా, తమిళనాడుకు బ్యాట్స్ మన్ మురళీ విజయ్, ఎస్. బద్రీనాథ్ లను తీసుకున్నట్లు శ్రీనివాసన్ వివరించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఈ జట్టు గురువారంనాడు నేరుగా అక్కడి నుంచే విండీస్ వెళ్ళనున్నదని ఆయన పేర్కొన్నారు. ముంబాయికి చెందిన ఆల్ రౌండర్ అభిషేక్ నాయర్ ఒక్కడికే జట్టులో కొత్తగా స్థానం కల్పించినట్లు చెప్పారు. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా, యువరాజ్ సింగ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారన్నారు. భుజానికి తగిలిన గాయం కారణంగా ట్వంటీ - 20 ప్రపంచ కప్ నుంచి తొలగించిన వీరేంద్ర సెహ్వాగ్ ను విండీస్ టూర్ కు కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. బొటనవేలికి అతి చిన్న గాయమే ఉన్నప్పటికీ సురేష్ రైనాను కూడా ఎంపిక సందర్భంగా పరిశీలనలోకి తీసుకోలేదని శ్రీనివాసన్ వివరించారు. రైనా రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇవ్వడంతో అతనికి చాన్స్ దక్కలేదన్నారు.
టీమిండియా ఇదే :
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్ (వైస్ కెప్టెన్), గౌతం గంభీర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, యూసఫ్ పఠాన్, మురళీ విజయ్, ఎస్. బద్రీనాథ్, ఆర్పీ సింగ్, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, అభిషేక నాయర్, ఆశిష్ నెహ్రా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్.
News Posted: 17 June, 2009
|