ట్వంటీ ఫైనల్స్ లో పాక్
నాటింగ్‌హామ్: దక్షిణాఫ్రికా పోరులో దురదృష్టం మళ్లీ నెగ్గింది. పాకిస్థాన్‌ను ఫెనల్స్ కు చేర్చింది. చేతిలో 5 వికెట్లున్నా...దక్షిణాఫ్రికాకు 7 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. తాజా ప్రపంచకప్‌లోనూ సెమిస్ దాటలేకపోయింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సఫారీ 20 ఓవర్లలో 142/5 స్కోరే చేయగల్గింది. పాకిస్థాన్ బౌలింగ్‌కు తలవంచింది. కలీస్(64) పోరాటం, ఫెైనల్‌కు చేర్చాలన్న డుమినీ(44 నాటౌట్) ఆరాటం వృథాప్ర యాసే అయింది. ఒక దశలో 40 పరుగుల వరకు వికెట్ కోల్పోని దక్షిణాఫ్రికా అదే స్కోరుపై తొలుత ఓపెనర్ గ్రేమ్ స్మిత్(10)ను, మరోపది పరుగుల వ్యవధిలో గిబ్స్(5), డివిలియర్స్(1)వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది.
బ్యాటింగ్‌లో రాణించిన అఫ్రిది... బౌలింగ్‌లోనూ 2/16 సత్తా చాటాడు.అంతకుముందు ఓపెనర్ కమ్రన్ అక్మల్ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని అఫ్రిది, షోయబ్ కొనసాగించారు. అఫ్రిది 32 బంతుల్లో (8్ఠ4) అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరోవెైపు షోయబ్ (34)కుదురుగా ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగు లు చేసింది. పేసర్లు స్టెయిన్, పార్నెల్ సహా స్పిన్నర్లు వాన్‌డర్‌మెర్వ్, డుమిని చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్ కమ్రన్ అక్మల్ బౌండరీతో శుభారంభాన్నిచ్చాడు. అయితే మరో ఓపెనర్ షాహజిబ్ హసన్(0) డకౌటై నిరాశపరిచాడు. తర్వాత అఫ్రిదితో కలిసి అక్మల్ భారీ షాట్లు బాదాడు. 4 బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో 12 బంతుల్లోనే 23 పరుగులు చేసిన అక్మల్ అదే ఊపు మీద భారీ షాట్‌కు ప్రయత్నించి నిష్ర్కమించాడు.
తర్వాత అఫ్రిది, షోయబ్ మాలిక్‌లు కుదురుగా ఆడుతూనే జట్టు స్కోరును 7 పరుగులకు తక్కువ కాకుండా పరుగెత్తించారు. 7 ఓవర్లలో 50 పరుగులు దాటిన పాకిస్థాన్ వందకు సమీపించసాగింది. ఈ క్రమంలో అఫ్రిది అర్ధసెంచరీ పూర్తి చేసుకన్నాడు. అయితే బంతినందుకున్న డుమినీ అఫ్రిది(51) మెరుపులకు చెక్‌పెట్టాడు. తర్వాత షోయబ్(34)ను వాన్‌డర్‌మెర్వ్ ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ జోరు తగ్గింది. చివర్లో కెప్టెన్ యూనిస్‌ఖాన్(24 నాటౌట్), రజాక్ (12 నాటౌట్)ను సఫారీ బౌలర్లు నిరోధించారు. 13 ఓవర్లలో 100 పరుగులు దాటిన పాకిస్థాన్ తదనంతరం ఏడు ఓవర్లలో చేసింది 49 పరుగులే!
స్కోరుబోర్డు
సంక్షిప్త స్కోర్లు : పాకిస్థాన్: 20 ఓవర్లలో 149/4 (అఫ్రిది 51, షోయబ్ మాలిక్ 34, యూనిస్ ఖాన్ నాటౌట్ 24, కమ్రన్ అక్మల్ 23; డుమిని 1/14)
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 142/5
(కలిస్ 64, డుమిని నాటౌట్ 44, గ్రేమ్ స్మిత్ 10; అఫ్రిది 2/16, సయిద్ అజ్మల్ 1/23)
News Posted: 18 June, 2009
|