విండీస్ చేరిన ధోనీ సేన
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు వెస్టీండీస్ తో జరిగే నాలుగు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ లో పాల్గొనడానికి లండన్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కు చేరుకుంది. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ , జహీర్ ఖాన్లు పాల్గొనడం లేదు. ఈనెల 26, 28న మొదటి రెండు వన్డేలు సబీనా పార్క్ లో జరుగుతాయి. జూలై 3న మూడో వన్డే, 5న నాలుగో వన్డేకు సెయింట్ లూసియా ఆతిథ్యమిస్తుంది. ఇంగ్లండ్ లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచకప్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయినప్పటికీ, వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ను గెల్చుకుంటామని కెప్టెన్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.
జట్టు సభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకున్న అతను విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెస్టిండీస్ ప్రతిభావంతంగా ఆడుతందని కితాబునిచ్చాడు. విండీస్ ను ఓడించడం సులభం కాదని వ్యాఖ్యానించారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ట్వంటీ-20 ఫార్మెట్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్ కు అలవాటు పడడానికి కొంత సమయం అవసరమని అన్నాడు. జట్టు కోచ్ గారీకిర్ స్టేన్ మాట్లాడుతూ ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ విఫలం కావడానికి అవిశ్రాంతంగా ఈ ఫార్మెట్ లో పోటీల్లో పాల్గొనడమే ప్రధాన కారణమని అన్నాడు. వెస్టీండీస్ లో భారత్ మెరుగైన ప్రదర్శనమిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ధోనీ కెప్టెన్సీలోని జట్టు సమతూకంగా ఉందని అన్నాడు. వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని అన్నాడు. పోటీ ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు. యువ ఆటగాళ్ళు రాణించడానికి ఇది మంచి సమయం అని ఆయన అన్నాడు.
News Posted: 20 June, 2009
|