కొత్త వివాదంలో బిసిసిఐ
న్యూఢిల్లీ : డిఫెండింగ్ చాంపియన్ గా ట్వంటీ 20 ప్రపంచకప్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీల్లో బరిలోకి దిగిన భారత జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్ళు ఫిట్ నెస్ తో లేరన్న వాదన క్రమంగా బలపడుతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పై విమర్శలు మరింతగా వెల్లువెత్తుతున్నాయి. జట్టు ఫిజియోథెరపిస్టు నితిన్ పటేల్ స్వయంగా ఆటాగళ్ళ గాయాల గురించి వెల్లడించడంతో బిసిసిఐ కొత్త వివాదాంలో చిక్కుకుంది. కనీసం సెమీస్ కూడా చేరలేకపోయిన భారత్ అనూహ్యమైన రీతిలో పరాజయాలను మూటగట్టుకుని అభిమానులను నిరాశ పర్చిన విషయం తెల్సిందే. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ గాయంపై పెద్ద దుమారమే లేచింది. భుజం గాయంతో బాధపడుతున్న అతనిని ప్రపంచకప్ పోటీలకు ఎలా ఎంపిక చేశారన్న విమర్శలు చెలరేగాయి. సూపర్ ఎయిట్ స్థాయి నుంచి భారత్ వెనక్కి తిరగడంతో బిసిసిఐ అసలు కారణాలను వెలికితీసే ప్రయత్నంలో పడింది. సెహ్వాగ్ తో సహా మొత్తం ఐదుగురు కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నప్పటికీ ఈ టోర్నీకి హాజర్యాయరని నితిన్ చేసిన ప్రకటన కొత్త వివాదానికి తెరతీసింది.
పటేల్ నివేదిక ప్రకారం సెహ్వాగ్ మాత్రమే గాక, జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, ఆర్పీసింగ్, జహీర్ ఖాన్లు కూడా పలు గాయాలతో బాధపడుతున్న వారే. నిజానికి ఈ నివేదికను టోర్నమెంట్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందే సెలక్షన్ కమిటీకి నితిన్ సమర్పించారు. కానీ వారి గాయాలు తీవ్రమైనవి కావని, పోటీలు ఆరంభమయ్యే లోగా కోలుకుంటారని నమ్మిన బిసిసిఐ ఈ ఐదుగురు ఆటగాళ్ళ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయాల బారినపడిన క్రికెటర్లను జట్టులోకి ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు బిసిసిఐ మీడియా, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా విచిత్రమైన రీతిలో స్పందించాడు. ప్రతి టోర్నీకి ముందు ఫిజియోలు ఈ విధంగానే నివేదికలు ఇవ్వడం సహజమేనని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే జట్టు ఎంపిక సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. అంతేగాక, గాయాలు త్వరగా నయమవుతాయన్న నమ్మకంతోనే వారిని జట్టుకు ఎంపిక చేశారని, ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని సమర్థించాడు.
అయితే, టోర్నీ ఆరంభమైన తర్వాత కూడా గాయం తగ్గలేదన్న కారణంగానే సెహ్వాగ్ ను ఇంగ్లండ్ నుంచి స్వదేశం పంపిన జట్టు మేనేజ్ మెంట్ మిగతా నలుగురు ఆటగాళ్ళను ఎలా కొనసాగించిందనే ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. సెహ్వాగ్ గాయం గురించి పదేపదే మాట్లాడిన ధోనీ తన గాయాన్ని కప్పి పుచ్చుకోవడం అతని ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న తర్వాత ధోనీకి జ్ఞానోదయం అయినట్లు కనిపించింది. జట్టులో అతి తక్కువ మంది మాత్రమే పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నారని, మిగతా వారంతా గాయాల కారణంగా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయారని నింపాదిగా చెప్పాడు. సెహ్వాగ్ మాదిరిగానే ధోనీతో సహా మిగతా గాయపడిన ఆటగాళ్ళు స్వదేశానికి ఎందుకు రాలేదని అభిమానులు నిలదీస్తున్న నేపథ్యంలో బిసిసిఐ ఆత్మరక్షణలో పడింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇది సాధారణమైన విషయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.
News Posted: 20 June, 2009
|