సైనా సంచలన విజయం
న్యూఢిల్లీ; హైదరాబాదీ బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలనం సృష్టించింది. జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో ఆరోసీడ్ సైనా 12-21, 21-18, 21-9 తేడాతో మూడో సీడ్ చైనాకు చెందిన లిన్ వాంగ్‌పై గెలిచి టైటిల్ సాధించింది. ప్రతి టోర్నీలో క్వార్టర్స్, సెమీస్ కు వరకు వెళ్లి ఆ తర్వాత చైనా క్రీడాకారిణిల చేతిలో పరాజయం చవిచూసే సైనా ఈ సారి దాన్ని అధిగమించి సెమీస్, ఫైనల్లో చైనా ప్లేయర్స్‌పైనే విజయం సాధించింది. గత వారం సింగపూర్ సూపర్‌సిరీస్‌లో వాంగ్ చేతిలో ఓడిన సైనా ఇప్పుడు 48 నిమిషాల పాటు పోరాడి విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.
సూపర్ సిరీస్ చరిత్రలో ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్, ప్రకాశ్‌పదుకొనేలు మాత్రమే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్స్ సాధించారు. ఆట ప్రారంభం నుంచే సైనాపై వాంగ్ ఆధిక్యం ప్రదర్శించింది. ఏడు స్మాష్ పాయింట్లతో 3-9కు వాంగ్ దూసుకుపోయింది. దీంతో సైనా వెనుకంజ వేయడంతో 12-21తో వాంగ్ తొలిగేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండోగేమ్ హోరాహోరిగా సాగింది. 5-5, 12-12, 16-16 ఇలా స్కోరు సమంగా సాగాయి. అయితే వరుసగా సైనా నాలుగు పాయింట్లు సాధించి 21-18తో గేమ్‌ను గెలిచింది. ఇక కీలకమైన మూడోగేమ్‌లో ఆరంభంలో 7-7తో ఇరువురు సమవుజ్జీలుగా ఉన్నారు. సైనా వరుసగా ఏడు పాయింట్లతో 15-9 ఆధిక్యానికి దూసుకుపోయింది.
ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు గెలవడంతో గేమ్‌ను మ్యాచ్‌తో పాటు తొలి సూపర్‌సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొత్తం మ్యాచ్‌లో సైనా స్మాస్‌ల ద్వారా 7, నెట్‌వద్ద 29 పాయింట్లు గెల్చుకోవడంతో పాటు 102 ర్యాలీల్లో 54సార్లు పైచేయి సాధించింది. ఈ విజయంతో సైనాకు దాదాపు రూ.8.5 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు లాభిస్తుంది: గోపీచంద్
ఈ విజయం సైనాకు వచ్చే ఆగష్టు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు ఎంతో ఉపయోగపడుతుందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.స్వదేశంలో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని ఆయన చెప్పారు.
గర్వపడుతున్నా: హర్విర్‌సింగ్
తన కూతురి విజయాన్ని చూసి గర్వపడుతున్నానని సైనా తండ్రి హర్విర్‌సింగ్ అన్నారు. తానొక్కడినే కాకా దేశం మొత్తం సైనా గెలుపు గర్వకారణమని చెప్పారు. దేశంలో ఎంతో మంది యువక్రీడాకారులకు ఆదర్శం అవుతుందని ఆయన తెలిపారు.
వైఎస్, బాబు అభినందనలు
తొలి సారిగా సూపర్ సిరీస్ గెలుపొందినందుకు సైనానెహ్వాల్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. సైనా విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. మరోవైపు సైనాకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు వీకే వర్మ రూ.రెండు లక్షల నగదును ప్రకటించారు.
News Posted: 21 June, 2009
|