తొలి వన్డే భారత్ వశం
కింగ్ స్టన్ : భారత్ బోణీ కొట్టింది. టి20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్ నుంచి పరాభవంతో నిష్క్రమించి, విమర్శల పాలైన ధోనీ సేన ఘ నమైన తొలి విజయాన్ని సాధించింది. వెస్టీండీస్ తో ప్రారంభమైన వన్డే సీరిస్ ను ఈ విజయంతో శుభారంభం చేసింది. సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ చెలరేగిపోయి బ్యాట్ ను ఝుళిపించి 131 పరుగులు చేయడంతో విండీస్ పై భారత్ 20 పరుగుల తేడాతో గెలిచింది.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 339 పరుగుల స్కోర్ ను సాధించింది. కానీ భారీ లక్ష్యం ముందు ఉన్నా విండీస్ బ్యాట్స్ మెన్లు ఎక్కడా వెనుకంజ వేయలేదు. అయితే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో 48.1 ఓవర్లకే 319 పరుగులు చేసి అంతా అవుటైపోయారు. సబినా పార్క మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. సిక్సర్ల వర్షం కురిసింది.ఈ గెలుపుతో నాలుగు వన్డే సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. యువీ సాధించిన స 131 పరుగుల్లో ఏడు సిక్స్ లు, పది బౌండరీలు ఉన్నాయి. ఓపెనర్ దినేష్ కార్తిక్ తో కలిసి మూడో వికెట్ కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యువీకి వెస్టీండిస్ గడ్డపై తొలి సెంచరీ కాగా ఆ జట్టుపై ఇది రెండో సెంచరీ కావడం విశేషం. కెరీర్ లో 12 వ సెంచరీని చేసిన యువీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
News Posted: 26 June, 2009
|