రెండో వన్డేలో భంగపాటు
కింగ్ స్టన్ : విండీస్ మెరుపుదాడికి భారత్ క్రికెట్ సైన్యం దాసోహమైంది. మొదటి విజయంతో కమ్మిన మైకం తలకెక్కి రెండో వన్డేలో అతి విశ్వాసానికి పోయిన ధోనీ సేనకు విండీస్ క్రికెటర్లు తలదిమ్మెక్కిపోయే దెబ్బ కొట్టారు. సబీనా పార్కలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు పరువు పొగొట్టుకుంది. గుడ్డిలో మెల్లలా కెప్టెన్ ధోని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడిన ఇన్నింగ్స్ కారణంగా దారుణ పరాభవం ఎదురుకాకుండా బయటపడగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ నిర్ణయం తప్పని విండీస్ బౌలర్లు తొలి ఓవర్లలోనే తెలిసేలా చేశారు. ఎప్పుడూ ఒకటే మంత్రం పఠిస్తే గుణపాఠాలు తప్పవని హెచ్చరించారు. కేవలం ఏడు పరుగులకే మూడు వికెట్లు కొల్పోయినా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లకు కనువిప్పు కలగలేదు. సాదాసీదా బౌలర్ రాం పాల్ సంధించిన బంతులు పండుల్లా కనిపించడంతో వాటి వెంటపడి కీపర్ కు, స్లిప్ ఫీల్డర్లకు దొరికిపోయారు.
ముగ్గురే బౌలర్లు భారత్ బ్యాట్స్ మెన్ పని పట్టేశారు. పేసర్ రాంపాల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్(4/37)నమోదు చేసుకున్నాడు. బ్రేవో 26 పరుగులకు 3 వికెట్లు, టేలర్ 35 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడంతో 48.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన భారత్ అత్తెసరు స్కోరు 188 పరుగులు చేయగలిగింది. అది కూడా ధనాధన్ ధోని అతి నింపాదిగా(బాధ్యతాయుతంగా?) ఆడి 95 పరుగులు చేయడంతో దక్కిన స్కోరు. ఒక దశలో21.4 ఓవర్లకు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో రుద్రప్రతాప్ సింగ్ తొమ్మిదో వికెట్ గా అడుగు పెట్టి ధోని కి తోడుగా 27 ఓవర్ల పాటు క్రీజులో నిలుచున్నాడు.75 బంతులు ఆడిన రుద్రప్రతాప్ 23 పరుగులు చేశాడు. ధోనితో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుద్ర ప్రతాప్ అవుటయిన తరువాత ధోని సెంచరీ చేయడానికి నెహ్ర సహకరించే ప్రయత్నం చేసినా టేలర్ బౌలింగ్ మొదటి బంతిని బౌండరీకి తరలించిన ధోని రెండో బంతికి కూడా భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.
తరువాత బ్యాటింగ్ కు దిగిన విండీస్ బ్యాట్స్ మెన్లు భారత బౌలింగ్ ను బాది బాది వదిలారు. 34.1ఓవర్లలోనే 192 పరుగులు సాధించి ఎనిమిది వికెట్ల ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో నాలుగు వన్డేల సీరీస్ ను 1-1 గా సమం చేశారు.
News Posted: 28 June, 2009
|