మూడో వన్డే ఇండియాదే
సెయింట్ లూసియ : వరుణుడు కరుణించాడు. భారత్ విజయం సాధించింది. టి20 తరహా అరపూట మ్యాచ్ లకు అలవాటు పడిపోయిన భారత క్రికెటర్లు 50 ఓవర్ల వన్డేల్లో కళ్ళు తేలేస్తున్న తరుణంలో వరుణుడు కరుణించడంలో మూడో వన్డే కాస్తా 20 ఓవర్లకు కుంచించుకుపోయింది. డక్ వర్త్ లూయీస్ సిద్ధాంతంతో విజయం సాధించింది. విండీస్ తో ఇక్కడ జరుగుతున్న కీలక మూడో వన్డే తో వర్షం ఆటలాడుకుంది. ఆట మొదలైన దగ్గర నుంచి నాలుగు సార్లు వర్షం కారణంగా ఓవర్లు కుదించుకువచ్చారు. విండీస్ నిర్ణీత 27 ఓవర్ల లో 185 పరుగులు చేస్తే డక్ వర్త్ లూయీస్ పద్దతిలో ఇండియా 195 పరుగులు చేయాలని నిర్ణయించారు. భారత్ 13.3 ఓవర్లు ఆడి 95 పరుగులు చేసిన తరుణంలో మళ్ళీ వర్షం అంతరాయం కలిగించింది. దాంతో 22 నిముషాల పాటు ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ను 22 ఓవర్లకు కుదించి 159 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. కెప్టెన్ ధోని గౌతమ్ గంభీర్ తో కలిసి బాధ్యతాయుతంగా ఆడటంతో భారత జట్టు విజయం వైపు పయనించింది. మధ్యలో గంభీర్, యువరాజ్ సింగ్ లు వెంటవెంటనే అవుటైనా, బాగా ఆడుతున్న రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరినా ధోని క్రీజుకే అతుక్కుపోయాడు. చివరి ఓవర్లో 11 పరుగులు చేయవలసి వచ్చింది. ధోని ఈ ఓవర్లో ఒక సిక్స్ కొట్టడంతో విజయం సులువైపోయింది. 35 బంతుల్లో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ధోని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. తొలుత టాస్ గెలిచిన ధోని విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. విండీస్ బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడారు. రాం నరేశ్ శర్వాన్ 62 పరుగులు చేశాడు.
News Posted: 3 July, 2009
|