గ్రాండ్ చారిత్రక హీరో ఫెదరర్
లండన్: రోజర్ ఫెదరర్... ఆధునిక టెన్నిస్‌లో అలుపెరగని రాకెట్ రణధీరుడు. గ్రాస్ కోర్టుగ్రాండ్ స్లామ్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజాన్ని మించిన దిగ్గజంగా రికార్డుల్లోకెక్కాడు. 15 టైటిళ్లతో ‘గ్రాండ్’ చరిత్రను తిరగరాశాడు. ‘ఆల్‌టైమ్ గ్రేట్’ పీట్ సంప్రాస్ రికార్డును కనమరగయ్యేలా చేశాడు. అతని చేతే... అతని ముందే గ్రాండ్ ‘సలామ్’ అనిపించుకున్నాడు. (టెన్నిస్ దిగ్గజం సంప్రాస్, క్రికెట్ మాస్టర్ సచిన్‌లు సతీసమేతంగా మ్యాచ్‌ను తిలకించారు)రోజర్ జోరుకు గ్రాండ్ స్లామ్ రికార్డు కనుమరుగైంది. ఏడో వింబుల్డన్ ఫెైనల్లో ఆరో టైటిల్ చేజిక్కింది. ఫెదరర్ పోరాడి గెలిస్తే... రాడిక్ పోరాడి ఓడాడు. 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన సమయంలో ఏసులతో తెగబడ్డారు. ప్రతి పాయింట్ కోసం తలబడ్డారు. ఫలితం ఫెదరర్ గ్రేట్ విక్టరీ. 3-2 సెట్లతేడాతో రాడిక్ ఓటమి. చివరి సెట్ నీదా నాదా? అన్నట్లు పోరాడారు. దీంతో 95 నిమిషాలపాటు సుదీర్గంగా సాగిన సెట్‌గా మూడో సెట్ రికార్డుల్లోకెక్కింది.
తుది మెట్టులో ప్రతీసారి తనకెదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు అరో సీడ్ రాడిక్. అందుకు తగ్గట్టుగానే బరిలోకి దిగిన ఈ అమెరికన్ స్టార్ రాడిక్ జోరు ముందు ఫెదరర్ ఆరంభంలో విలవిలలాడాడు. గంటకు 143 మైళ్ల వేగంతో సర్వీస్ చేస్తున్న రాడిక్ శూరత్వానికి ఫెదరర్ తొలుత చేష్టలుడిగాడు. దీంతో అగ్రశ్రేణి అటతీరుతో అలరించిన అండీ రాడిక్ 39 నిమిషాల్లోనే తొలిసెట్‌ను 7-5తో కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లోనూ ఇదే ఊపును కొనసాగించాడు. రెట్టించిన ఉత్సాహంతో రెండో సీడ్ స్విస్ స్టార్‌పెై తెగబడ్డాడు. దీంతో రెండో సెట్‌లోనూ ఫెదరర్ వెనుకంజలో నిలువక తప్పలేదు. అయితే పోరాటం తెలిసిన ఫెదరర్ వెనుకంజ నుంచే పురోగమించాడు. దీంతో 5-5, 6-6గా ఉన్న రెండో సెట్‌ను టైబ్రేక్‌తో 7-6 (8/6) స్కోరుతో వశం చేసుకున్నాడు. ఇద్దరూ చెరో సెట్ నెగ్గారు.
రెండో సెట్ విజయంతో ఫెదరర్ విజృం భించాడు. పుంజుకొని మూడో సెట్‌లో పిడికిలి బిగించాడు. ఏసులతో, రిటర్స్‌లతో విరుచుకుపడ్డాడు. రాడిక్ ఇందుకు తగ్గట్లే స్పందించినప్పటికీ పెైచేయి సాధించిన ఫెదరర్ 7-6(7/5) స్కోరుతో మూడో సెట్ నెగ్గాడు. 2-1 సెట్లతో ఆధిక్యంలోకి వచ్చాడు. నాలుగో సెట్ మొత్తం రాడిక్ జోరుకే తలవంచింది. కేవలం 32 నిమిషాల్లోనే సెట్‌ను ముగించాడు. 6-3 స్కోరుతో 2-2 సెట్లుగా ఫెదరర్ ఆధిక్యానికి తూట్లు పొడిచాడు. ఇక చివరి అంకం మొదలెైంది. అదలాగే కొనసాగింది.
ఒకరిపై ఒకరు ఏసులు దూశారు. ఖచ్చితమైన ప్లేస్‌మెంట్లతో ఫలితాలు సాధించారు. చూస్తుండగానే సెట్ రెండంకెల స్కోరును దాటింది. సమయం గంటన్నరకు చేరింది. చివరకు ఫెదరర్ 16-14 స్కోరుతో ఐదో సెట్‌ను, టైటిల్‌ను చేజిక్కించున్నాడు. 15 టైటిళ్లతో చరిత్రకెక్కాడు. మొత్తం 50 ఏసుల్ని ఫెదరర్ సంధించగా, రాడిక్ 27 ఏసుల్ని సంధించాడు.
News Posted: 5 July, 2009
|