ఇంగ్లండ్ చారిత్రక విజయం
లండన్ : టెస్ట్ క్రికెట్ లో డబ్బై ఐదేళ్ళ తరువాత ఇంగ్లండ్ జట్టు తన సొంతగడ్డపై తొలి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడి లార్డ్స్ మైదానంలో సోమవారం ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల యాషెస్ సీరీస్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ 115 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇంత చక్కని విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఫ్లింటాఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే.
522 పరుగులు ప్రపంచ రికార్డు లక్ష్య సాధించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు చివరి రోజున 406 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. రెండో టెస్ట్ నాలుగో రోజు ఆదివారం ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఫాస్ట్ బౌలింగ్ ముందు ఆసీస్ బ్యాట్స్ మెన్ తల వంచక తప్పలేదు. ఫ్లింటాఫ్ కు తోడుగా గ్రేమ్ స్వాన్ కూడా రెచ్చిపోయి బంతులు వేసి ఆస్ట్రేలియా జట్టును కకావికలు చేశాడు. స్వాన్ 87 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో మైఖేల్ క్లార్క్ (136), బ్రాడ్ హడ్డిన్ (80), మిట్చెల్ జాన్సన్ (63) తప్ప కెప్టెన్ రికీ పాంటింగ్ సహా మరెవ్వరూ అర్ధ సెంచరీ దరిదాపుల్లోకి కూడా రాలేక పోయారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 4 పరుగులే చేసినా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్న ఫ్లింటాఫ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 27 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఫ్లింటాఫ్ బౌలింగ్ లో తన విశ్వరూపాన్నే ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫిలిప్ హ్యూస్, సైమన్ కటిచ్ లను, ఆ జట్టు స్కోరులో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లో రెండో స్థానంలో నిలిచిన బ్రాడ్ హడ్డిన్ తో పాటు టెయిలెండర్లు నాథన్ హారిట్జ్, పీటర్ సిడ్డిల్ లను ఫ్లింటాఫ్ పెవిలియన్ కు పంపించాడు.
అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ స్కిప్పర్ ఆండ్రూ స్ట్రాస్ తన జట్టును ముందుగా బ్యాటింగ్ కు దింపాడు. ఈ సీరీస్ లో మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 30న ఎడ్గ్ బాస్టన్ లో ప్రారంభం అవుతుంది.
News Posted: 20 July, 2009
|