దాదాకే మళ్ళీ కెప్టెన్సీ
కోల్ కతా : ఐపిఎల్ 3 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సారథిగా మళ్ళీ సౌరవ్ గంగూలీ (దాదా) బాధ్యతలు నిర్వహించనున్నాడు. ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (బాద్షా) కోల్ కతా నైట్ రైడర్స జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ జట్టు కెప్టెన్ గా ఉన్న మెక్ కల్లమ్ తన బాధ్యతల నుంచి వైదొలగడంతో బాద్షాకు గంగూలీని ఆశ్రయించక తప్పలేదు. మొట్టమొదటి ఐపిఎల్ టోర్నీ ముగిసిన అనంతరం జట్టు కెప్టెన్ గా గంగూలీని తప్పించి, మెక్ కల్లమ్ కు షారుఖ్ బాధ్యతలు అప్పగించారు. లండన్ లో గంగూలీతో సమావేశం అయిన తరువాత బాద్షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాను తప్పించినప్పటికీ రెండో ఐపిఎల్ సీజన్ లో జట్టు ఎలాంటి ఉత్తమ ప్రదర్శన కనబరచకపోవడంతో బాద్షా ఖిన్నుడయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఐపిఎల్ 2 సీజన్ లో దారుణంగా విఫలమై, ఓటములు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ నిస్తేజాన్ని ప్రదర్శించిన తన జట్టు తీరు చూసిన షారుఖ్ ఖాన్ కోపంతో భారతదేశం తిరిగి వచ్చేశాడు. జట్టుకు ఒక్కరే కెప్టెన్ పద్ధతిని తోసిరాజని ఆయన మల్టీ కెప్టెన్సీ బెస్ట్ అంటూ షారుఖ్ పరుగులు తీశారు. తన వ్యూహం ఫలించకపోకపోగా బండెడు అవమానాన్ని నెత్తిన మోయాల్సి వచ్చింది బాద్షాకు.
దీనితో తన ఆలోచన వేస్ట్ అని, గంగూలీయే బెస్ట్ అంటూ షారుఖ్ ఖాన్ మళ్ళీ దాదాకే పార్టీ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించక తప్పలేదు.
News Posted: 25 July, 2009
|