ఫైనల్లో సానియా
లెగ్జింగ్టన్ : పెళ్ళికి నిశ్చతార్ధం జరిగిన తరువాత మన టెన్నిస్ తార సానియా మీర్జా దశ తరిగినట్టుంది. యూఎస్ ఓపెన్‌కు వార్మప్ మ్యాచ్ లుగా భావించే ఏటీఎఫ్ లెగ్జింగ్టన్ ఛాలెంజర్స్ టోర్నీలో సానియా ఫైనల్ కు చేరుకుని సంచలనం సృష్టించింది. ఈ హార్డ్‌కోర్ట్ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సానియా సెమీఫైనల్లో 6-1, 4-6, 6-4 తేడాతో ఆరో సీడ్ మెంగ్ యువాన్ (చైనా)పై విజయం సాధించింది. సానియా తొలిసెట్‌ను 6-1 తేడాతో సునాయసంగా గెలుపొందింది. అయితే రెండోసెట్‌లో యువాన్ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో ఆ సెట్‌ను పోగొట్టుకుంది. కీలకమైన మూడో సెట్‌లో ఇరువురు హోరాహోరిగా తలపడ్డారు. చివరికి సానియా 6-4తో సెట్‌ను కైవసం చేసుకొని ఫైనల్లో ప్రవేశించింది. ఈ సీజన్‌లో సానియాకు ఇదే తొలి సింగిల్స్ ఫైనల్. సానియా ఫైనల్లో టాప్ సీడ్ జూలియా కొయిన్ (ఫ్రాన్స్) తో తలపడనుంది. సానియా విజేతగా నిలిస్తే 50వేల డాలర్ల ఫ్రైజ్‌మనీ ని సొంతం చేసుకుంటుంది.
News Posted: 27 July, 2009
|