బ్యాడ్మింటన్ టోర్నీ షురూ హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన జ్యోతిని వెలిగించి టోర్నీని ఆరంభించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు గచ్చీబౌలిలోని జిఎంసి (శాప్) ఇండోర్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. సుమారు 50 దేశాల నుంచి మూడు వందల మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. గతంలో ప్రపంచ మిలిటరీ క్రీడలను హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని వైఎస్ గుర్తు చేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీని కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ చాంపియన్ షిప్ తనకు మరో మధురమైన జ్ఞాపకంగా మిగలుతుందన్న ఆశాభావాన్ని వైఎస్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే ఐటికి పర్యాయపదంగా మారిందని, అయితే క్రీడలకూ తమ ప్రభుత్వం అంతే ప్రాధాన్యం ఇస్తోందని, నగరాన్ని క్రీడానగరంగా కూడా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ సందర్భంగా నిర్వహించే వేడుకలు ప్రతి ఒక్కరికీ గుర్తుండేలా నిర్వహిస్తామన్నారు.
ఈ ప్రారంభ వేడుకల్లో దిజు - సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ఐటి, క్రీడల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి, ఎమ్మెల్యే టిజి వెంకటేశ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ రాధ, క్రీడా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
తీవ్రవాదం ముప్పు ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించిన నేపథ్యంలో ఈ పోటీల సందర్భంగా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులు బస చేసి ఉన్న హొటళ్ళ వద్ద కూడా పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో మొహరించారు. క్రీడాకారులను స్టేడియంలోకి తీసుకురావడం నుంచి వారిని తిరిగి వారుంటున్న హొటళ్ళకు చేర్చే వరకూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎస్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. స్టేడియంలోకి వెళ్ళేందుకు ఒకే ఒక్క గేటును మాత్రమే తెరిచి అక్కడ మెటల్ డిటెక్టర్లు సహా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
News Posted: 10 August, 2009
|