ఐపిఎల్ లో ఐసిఎల్ క్రికెటర్లు! ముంబయి: ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)తో తెగతెంపులు చేసుకున్న క్రికెటర్లకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అవకాశం కల్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలిసింది. రెబల్ క్రికెట్ లీగ్‌తో ఒప్పం దాన్ని రద్దు చేసుకుని మళ్లీ అధికార బోర్డు పంచాన చేరిన క్రికెటర్లకు అన్ని విధాల అండగా నిలువాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే వారికి వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీల తరఫున బరిలో దింపాలని ఆలోచిస్తోంది. గురువారం జరిగే బీసీసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని అవకాశం ఉంది. అంతేగాక ఐసీఎల్‌తో తెగతెంపులు చేసుకున్న క్రికెటర్లకు ఆర్థిక సహాయం అందించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐసీఎల్‌ను వీడడంతో ఖాళీగా ఉన్న క్రికెటర్లకు అర్హతను బట్టి 8నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే యోచనలో క్రికెట్ బోర్డు ఉంది. మొత్తం 79 మంది క్రికెటర్లు ఐసీఎల్‌ను వీడి బీసీసీఐ పక్షాన చేరిన విషయం తెలిసిందే. ఇందులో గతంలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన పలువురు ఆటగాళ్లు న్నారు. రోహన్ గవాస్కర్, దినేష్ మోంగియా, దీప్‌దాస్‌గుప్తా, రితేందర్ సింగ్ సోధి, జెపి.యాదవ్, హెమంగ్ బదాని, శ్రీరాం తదితరులున్నారు. కాగా, ఐసీఎల్ తరఫున అద్భుతంగా రాణించిన రోహన్, ఝున్‌ఝన్‌వాల, బదాని, టి.కుమారన్, టిపి సింగ్, రాయుడు తదితరులకు ఐపీఎల్ మూడో సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీల్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News Posted: 12 August, 2009
|