సైనాకు అసలు పరీక్ష నేడు హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింట్ చాంపియన్ షిప్ సింగిల్స్ తొలి రౌండ్లలో సునాయాసంగా ప్రత్యర్థులపై విజయాలు సాధించిన భారత ఆశాకిరణం, ఏస్ షట్లర్, హైదరాబాద్ క్రీడాకారిణి ఫిట్ నెస్ కి గురువారం నాటి ప్రీ క్వార్టర్స్ ఫైనల్ అసలైన పరీక్ష కానున్నదా? ఆమె చెబుతున్న మాటలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. రెండో రౌండ్ లో రష్యా క్రీడాకారిణిని ఓడించడం ద్వారా తాను ఫిట్ నెస్ గా ఉన్న విషయం నిరూపణ అయినా ప్రీ క్వార్టర్స్ లోనే తనకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానున్నదని సైనా పేర్కొంది.
తొలి రౌండ్లలో తన స్థాయికి తగ్గట్టుగా ఆడినట్లు సైనా చెప్పింది. అయితే, చికెన్ పాక్స్ నుంచి ఇటీవలే కోలుకున్నప్పటికీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కాని, పూర్తయిన తరువాత కాని అలసిపోయిన ఫీలింగ్ కలగలేదని చెప్పింది. గురువారం సాయంత్రం జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్లో బలమైన ప్రత్యర్థి బల్గేరియాకు చెందిన పదో సీడ్ పెట్యా నెడెల్చెవాతో తలపడాల్సి ఉన్నందున కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుందని సైనా తెలిపింది. ఈ మ్యాచ్ తన అసలైన ఫిట్ నెస్ గురించి వెల్లడిస్తుందని చెప్పింది.
అంతకు ముందు బుధవారం జరిగిన రెండో రౌండ్లో రష్యాకు చెందిన అనస్తీషియా ప్రాకొపెంకో పై 21-10, 21-17 వరుస గేమ్ లలో సైనా విజయం సాధించి, ప్రీక్వార్టర్ ఫైనల్ కు చేరింది.
పురుషుల సింగిల్స్ లో కూడా 15 సీడ్ చేతన్ ఆనంద్ 21-9, 21-17 గేమ్ ల తేడాతో బల్గేరియాకు చెందిన స్టిల్లన్ మకర్ స్కీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు. గురువారం జరగనున్న ప్రీ క్వార్టర్స్ లో చేతన్ ఇండోనేసియాకు చెందిన ఆరో సీడ్ సోనీ డ్వికన్ కోరోతో తలపడతాడు. కాగా, తొలి రౌండ్ లో విజయం సాధించిన మరో భారత ఆటగాడు కశ్యప్ 21-14, 10-21, 7-21 తేడాతో చైనాకు చెందిన రెండో ర్యాంకు ఆటగాడు జిన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
News Posted: 13 August, 2009
|