క్రికెట్ కు కాంబ్లీ గుడ్ బై ముంబయి : అంతర్జాతీయ క్రికెట్ కు వినోద్ కాంబ్లీ గుడ్ బై చెప్పారు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొమ్మిది సంవత్సరాల తరువాత కాంబ్లీ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఇక్కడి విఖ్రోలీలోని వికాశ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మల్టీ స్పోర్ట్ అకాడమీ ఖేల్ భారత్ ప్రారంభోత్సవ సభకు హజరైన వినోద్ కాంబ్లీ తన రిటైర్మెంట్ ప్రకటనకు వేదికగా చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి డాషింగ్ బ్యాట్స్ మన్ సెహ్వాగ్ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. తాను దేశీయ క్రికెట్ మ్యాచ్ లో ఆడటానికి అందుబాటులో ఉంటానని తెలిపాడు. తన క్రికెట్ జీవితంలో సహకరించిన వారందరకీ కాంబ్లీ ధన్యవాదాలు చెప్పాడు. ముఖ్యంగా తన గురువు అచ్రేకర్, స్నేహితుడు సచిన్ కు ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు. కాంబ్లీ ఆకస్మకంగా చేసిన రిటైర్మెంట్ ప్రకటన అందరినీ విస్మయం కలిగించింది.
ఇక్కడే ఎందుకు రిటైర్మెంట్ ప్రకటన చేసారని కాంబ్లీని అడిగినప్పుడు ` ఇది నా జీవితానికి కొత్త ఆరంభం. ఇంతవరకూ జరిగిన దానికి నేనేమీ చింతించడం లేదు. నేను ఇంకా ఎక్కువ కాలం క్రికెట్ ఆడి ఉండాలి. కాని దురదృష్టవశాత్తూ పరిస్థితులు కలిసి రాలేదు' అని కాంబ్లీ చెప్పాడు. సెహ్వాగ్ ఈ కార్యక్రమానికి హజరైనా మరాఠీలో సాగిన సంభాషణలను అర్ధం చేసుకోలేకపోయాడు. దాంతో కాంబ్లీయే అనువాదకునిగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ తాను కాంబ్లీ ఆటను చూస్తూ ఎదిగిన వాడినని, కాంబ్లీ కొత్త ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఈ అకాడమీ గొప్ప ఆటగాళ్ళను దేశానికి అందివ్వాలని ఆకాంక్షించాడు.
News Posted: 17 August, 2009
|