యాషెస్ విజేత ఇంగ్లాండ్ లండన్: ఎట్టకేలకు ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ ను సొంతం చేసుకొంది. ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో ఇంగ్లాండ్ 197 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి నాలుగేళ్ల తర్వాత యాషెస్‌ను సొంతం చేసుకొంది. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఫ్లింటాఫ్‌కు సిరీస్ విజయంతో ఇంగ్లాండ్ గ్రాండ్ ఫెర్‌వెల్ ఇచ్చింది. 546 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 348 పరుగులకు ఆలౌట్ అయింది. మైక్ హస్సీ(121) సెంచరీ చేసిన జట్టును ఓటమి నుంచి కాపాడ లేకపోయాడు. అంతకముందు 80/0 ఓవర్‌నైట్ స్కోరు వద్ద బాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కటిచ్ (43) స్వాన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కాసేపటికే వాట్సన్ (40) బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ పాంటింగ్, మైక్ హస్సీ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. లంచ్ విరామం వరకు మరో వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తపడ్డారు.
లంచ్ విరామం తర్వాత పాంటింగ్, హస్సీలు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరు క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో ఫ్లింటాఫ్ వేసిన ఓ అద్బుత త్రోకు పాంటింగ్ (66) నిష్ర్కమించాడు. ఆ వెంటనే క్లార్క్ (0) కూడా స్ట్రాస్ వేసిన త్రోకు ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. సిరీస్‌లో తొలిసారి అద్భుతంగా ఆడుతున్న హస్సీ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మరోఎండ్‌లో అతనికి బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించలేదు. చివరికి హస్సీ (121) స్వాన్ బౌలింగ్‌లో కుక్ క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ 348 పరుగులకు ఆలౌట్ అయింది. తమ లెజండరీ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు.
స్కోరుబోర్డు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 332, రెండోఇన్నింగ్స్: 373/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 160, రెండో ఇన్నింగ్స్: వాట్సన్ (ఎల్బీ-బి) బ్రాడ్ 40, కటిచ్ (ఎల్బీ-బి) స్వాన్ 43, పాంటింగ్ (రనౌట్/ఫ్లింటాఫ్) 66, హస్సీ (సి) కుక్ (బి) స్వాన్ 121, క్లార్క్ (రనౌట్/స్ట్రాస్) 0, నార్త్ (స్టంప్) ప్రియర్ (బి) స్వాన్ 10, హడ్డిన్ (సి) స్ట్రాస్ (బి) స్వాన్ 34, జాన్సన్ (సి) కాలింగ్‌వుడ్ (బి) హార్మిసన్ 0, సిడిల్ (సి) ఫ్లింటాఫ్ (బి) హార్మిసన్ 10, స్టువార్ట్ క్లార్క్ (సి) కుక్ (బి) హార్మిసన్ 0, హిల్ఫెనాస్ (నాటౌట్) 4, అదనం 20, మొత్తం: 348 ఆలౌట్
వికెట్లపతనం: 1-86, 2-90, 3-217, 4-220, 5-236, 6-327, 7-327, 8-343, 9-343, 10-348
బౌలింగ్:అండర్సన్12-2-46-0, ఫ్లింటాఫ్ 11-1-42-0, హార్మిసన్ 16-5-54-3, స్వాన్ 40.2-8-120-4, బ్రాడ్ 22-4-71-1, కాలింగ్‌వుడ్ 1-0-1-0
News Posted: 23 August, 2009
|