తొలి ఐపిఎల్ కు 661 కోట్లు ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుంచి మొదటి సీజన్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఖజానాకు సమకూరిన మొత్తం రూ. 15 కోట్లు కూడా లేదు. 2009 మార్చితో ముగిసిన సంవత్సరంలో ఐపిఎల్ ఆదాయ, వ్యయాలపై రూపొందించిన ముసాయిదా పత్రం ప్రకారం ఈ అత్యున్నత స్థాయి టోర్నమెంట్ వల్ల మొత్తం రూ. 661 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. కాని ఖర్చులు పోను మిగిలిన మొత్తం రూ. 14.86 కోట్లు మాత్రమే. బోర్డు సభ్యుల పరిశీలన నిమిత్తం వారికి పంపిణీ చేస్తున్న బిసిసిఐ వివరణాత్మక ఆర్థిక పద్దులలో భాగంగా ఈ ముసాయిదా పత్రానికి రూపకల్పన జరిగింది.
మీడియా హక్కులు, స్పాన్సర్ షిప్స్ ద్వారా ఐపిఎల్ కు వచ్చిన ఆదాయంలో ఫ్రాంచైజీల వాటా, నగదు బహుమతి, ప్రారంభోత్సవ వ్యయం, ప్రకటనలు ఈ ఖర్చుల పద్దులో చేరాయి. 2008 చాంపియన్స్ లీగ్ ను రద్దు చేసినందుకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కు నష్టపరిహారంగా అందజేసిన రూ. 26 కోట్లు కూడా ఈ ఖర్చుల పద్దులో చేర్చారు.
బోర్డు 2008 - 09 సంవత్సరానికి సంబంధించిన పద్దులను సమీక్షిస్తున్నట్లు, ఆర్థిక ప్రకటనల ముసాయిదా కాపీని పరిశీలన కోసం సభ్యులకు పంపినట్లు బిసిసిఐ సీనియర్ సభ్యులు ఇద్దరు ధ్రువీకరించారు. బోర్డు సెప్టెంబర్ 2న నిర్వహించే సమావేశంలో ఈ పద్దులను ఆమోదించవచ్చునని భావిస్తున్నారు. ఈ ముసాయిదా పత్రం ప్రకారం, బ్రాడ్ కాస్ట్ సంస్థ మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు, క్రీడల మార్కెటింగ్ సంస్థ వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ నకు మీడియా హక్కుల విక్రయం ద్వారా ఐపిఎల్ కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.
పది సంవత్సరాలకు 1.02 బిలియన్ డాలర్ల మేరకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల ఐపిఎల్ కు మొదటి సంవత్సరం రూ. 242 కోట్లు లభించాయి. ఈ లీగ్ ప్రచారం నిమిత్తం అంగీకరించిన 108 మిలియన్ డాలర్ల మొత్తం కూడా ఇందులో చేరి ఉంది. మీడియా హక్కులను రెండవ సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల కాలానికి 1.6 బిలియన్ డాలర్ల మేరకు ఆ భాగస్వాములతోనే సంప్రదింపులు మీడియా హక్కులు కేటాయించారు. మొదటి సంవత్సరంలో ఫ్రాంచైజీ ఒడంబడికల వల్ల సుమారు రూ. 290 కోట్లు, స్పాన్సర్ షిప్స్ వల్ల రూ. 111 కోట్లు సమకూరాయి. ఇతర ఆదాయ వనరులలో స్వాదుపానీయాల సంస్థ పెప్సికోతో రూ. 10 కోట్ల మేరకు కుదుర్చుకున్న హక్కుల ఒప్పందం కూడా ఉన్నది.
ఐపిఎల్ యాజమాన్యం వాగ్దానం చేసిన ప్రకారం, ఈ ఆదాయంలో అధిక భాగాన్ని ఫ్రాంచైజీలతో పంచుకోవడంతో పాటు ఈ టోర్నీపై ఉత్సుకత పెంచేందుకు తీసుకున్న చర్యలకు వెచ్చించారు. ఉదాహరణకు, ఐపిఎల్ సెంట్రల్ రెవెన్యూ పూల్ లో ఫ్రాంచైజీల వాటాలో భాగంగా వాటికి సుమారు రూ. 220 కోట్లు అందజేశారు. హక్కుల కేటాయింపు వల్ల వచ్చిన ఆదాయం నుంచి రూ. 10 కోట్లను కూడా లీగ్ ఫ్రాంచైజీలతో పంచుకున్నది. ఐపిఎల్ యాజమాన్యం ప్రకటనలపై రమారమి రూ. 33 కోట్లు ఖర్చు చేసింది. ఇక అదనంగా లీగ్, పాలనాపరమైన ఖర్చులు రూ. 65 కోట్ల మేరకు ఉన్నాయి.
ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి ఈ విషయమై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తాను అకౌంట్లను చూడలేదని ఆయన చెప్పారు. అయితే, 'లాభాలు తక్కువగా ఉండి ఉండవచ్చు. కాని ఐపిఎల్ వల్ల సమకూరిన మొత్తం డబ్బును పరిగణనలోకి తీసుకోవాలి' అని లలిత్ మోడి అన్నారు. 2008 - 09 సంవత్సరానికి సంబంధించిన బిసిసిఐ ఆర్థిక పద్దులు ఇప్పటికీ ఆడిటర్ల వద్దే ఉన్నందున ఈ విషయమై తాను వ్యాఖ్యానించజాలనని బిసిసిఐ గౌరవ కోశాధికారి ఎం.పి. పాండవ్ చెప్పారు.
News Posted: 28 August, 2009
|