నిరాశ పరచిన ఐపిఎల్ న్యూఢిల్లీ : జనాభిప్రాయానికి భిన్నంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్లకు దక్షిణాఫ్రికాలో జరిగిన రెండవ ఐపిఎల్ టోర్నీ నుంచి కూడా నష్టాలే ఎదురుకావచ్చు. 'నష్టాల నుంచి బయటపడతామని మేము ఆశిస్తున్నాం. కాని అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు' అని ఒక ఫ్రాంచైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరి మూడు ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇప్పడున్న పరిస్థితులను బట్టి తమకు ఒక్కొక్కరికి రూ. 1020 కోట్ల మేరకు నష్టం వాటిల్లవచ్చునని అనుకుంటున్నట్లు వారు తెలిపారు. వారిని మరింత అయోమయంలోకి నెట్టుతున్న సంగతి ఏమిటంటే రెండవ ఐపిఎల్ ముగిసిన మూడు నెలల తరువాత కూడా అసలు ఎంత మొత్తం ఖర్చు చేశారో ఎవరికీ స్పష్టంగా తెలియకపోవడం.
అయితే, ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఈ విషయమై ఏమీ కలవరపడడం లేదు. 'ఇది మరీ తొందరపాటు. మేము వారి గణాంక వివరాలు ఇవ్వనిదే తమకు నష్టాలు వచ్చాయని వారు ఎలా చెప్పగలరు' అని మోడి అన్నారు. కాని ముందుగా గేట్ టిక్కెట్ల అమ్మకం వల్ల వచ్చిన నష్టాలను ఐపిఎల్ ఎలా భర్తీ చేస్తుందో తమకు అంతు పట్టడం లేదని ఐపిఎల్ జట్లు చెబుతున్నాయి. ఇండియాలో మ్యాచ్ లు ఆడినప్పుడు వచ్చిన మొత్తం కన్నా దక్షిణాఫ్రికాలో గేట్ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం అత్యల్పం. ఎందుకంటే దక్షిణాఫ్రికన్లను ఆకర్షించడానికి టిక్కెట్ల రేట్లను బాగా తక్కువగా నిర్ణయించారు. మొదటి సీజన్ లో ఢిల్లీ, ముంబైలలో గేట్ అమ్మకాల ద్వారా రూ. 20 కోట్లు సమకూరినట్లు తెలుస్తున్నది.
అయితే, ఫ్రాంచైజీలు ఒక విషయంలో మాత్రం ఆశాభావంతో ఉన్నారు. మార్చిలో కుదుర్చుకున్న కొత్త టివి హక్కుల ఒప్పందం వారిలో ఆశలు రేకెత్తిస్తున్నది. టివి ఆదాయాలు క్రితం సంవత్సరం కన్నా గణనీయ స్థాయిలో అధికంగా ఉన్న పక్షంలో వారికి కొంత మేరకు లాభం రావచ్చు. నిరుడు ఒక్కొక్క జట్టుకు ఈ విధంగా రూ. 26 కోట్లు నుంచి రూ. 32 కోట్ల వరకు ఆదాయం లభించింది.
ఐపిఎల్ ను దీర్ఘకాలిక వాణిజ్యంగా ఫ్రాంచైజీలు పరిగణిస్తున్నప్పటికీ, దక్షిణాఫ్రికాలో నిర్వహించడం వల్ల రెండవ ఐపిఎల్ టోర్నీ నుంచి వస్తాయనకుంటున్న నష్టాలే కొన్ని జట్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయితే, ఈ సీజన్ గురించి అప్పుడే వ్యాకులపడడం తొందరపాటే అవుతుందని లలిత్ మోడి అంటున్నారు.
రెండవ ఐపిఎల్ టోర్నీపై ఎంత మొత్తం ఖర్చు చేశారనేది గాని, దీని నుంచి తమకు ఎంత మొత్తం వస్తుందనేది గాని తమకు తెలియడం లేదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. 'ఇది (బుధవారం ముంబైలో జరిగిన సమావేశం) మొదటి సమావేశం మాత్రమే. అయిన ఖర్చులకు సంబంధించిన గణాంకాలను మాకు అందజేయవలసిందిగా ఈ సమావేశంలో వారిని మేము కోరాం. మాకు ఆ గణాంకాలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మేము ఏ సంగతీ స్పష్టంగా చెప్పగలం. కాని మాకు అయిన ఖర్చుల సమాచారాన్ని వారికి మేము ఇవ్వవలసిన అవసరం ఉండదు. మేము వారి దగ్గర నుంచి గణాంకాల కోసం నిరీక్షిస్తున్నాం' అని ఆయని తెలియజేశారు.
'వారు హోటళ్ళు వగైరాలపై ఎంత ఖర్చు చేసి ఉంటారో మాకు తెలుసు. ఎందుకంటే వారు సెంట్రల్ కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం చెల్లింపులు జరపవలసి ఉంటుంది. ఉదాహరణకు, కోట్ చేసిన రేటు 200 డాలర్లు (సుమారు రూ. 9783) అయినట్లయితే, మాకు 120 డాలర్లు (సుమారు రూ. 5869) సెంట్రల్ కాంట్రాక్ట్ రేటు లభించింది. టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించిన కారణంగా ఇండియా సంబంధిత కార్యక్రమాలపై లేదా కాంట్రాక్టులపై తమకు నష్టం వచ్చి ఉండేదని వారు చెబుతున్నారు. అందుకు వారికి నష్టపరిహారం చెల్లిస్తారా? మేము ఏ సంగతీ నిర్ణయించే ముందు వారు మాకు ఏమి అందజేస్తారో చూస్తాం' అని ఆయన పేర్కొన్నారు.
News Posted: 29 August, 2009
|