బిసిసిఐకి ఐఎంజి వేడికోలు న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు రూపకల్పన, అమలు, నిర్వహణలో కీలక భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్ (ఐఎంజి) తన సేవలను ఇక ఉపయోగించుకోరాదన్న నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ)కి విజ్ఞప్తి చేసింది. 'ఐఎంజి కాంట్రాక్ట్ విషయంలో తన హక్కులను పరిరక్షించుకుంటుంది. చట్ట ప్రకారం పరిష్కార మార్గాలను అనుసరించవచ్చు' అని ఐఎంజి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ వైల్డ్ బ్లడ్ బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ కు రాసిన ఒక లేఖలో సూచించారు. అయితే, బిసిసిఐ నుంచి ఐఎంజికి అందిన వర్తమానంలో గల 'అనేక అసంబద్ధతల' గురించి ఆ లేఖలో వైల్డ్ బ్లడ్ ప్రస్తావించారు.
చట్టబద్ధమైన కాంట్రాక్టును ఐఎంజితో బిసిసిఐ 2007 సెప్టెంబర్ 13న కుదుర్చుకుందని, ఆ కాంట్రాక్టును రద్దు చేయడానికి శ్రీనివాసన్ ప్రయత్నిస్తున్నట్లు 2009 ఆగస్టు 28 నాటి లేఖ సూచిస్తున్నదని వైల్డ్ బ్లడ్ పునరుద్ఘాటించారని సంస్థ ప్రతినిధి ఒకరు 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో చెప్పారు. 'కాంట్రాక్టు రద్దుకు మీరు కారణాలేవీ వెల్లడించలేదు. అందుకు కారణాలేవీ లేవనేదే అసలు వాస్తవం' అని వైల్డ్ బ్లడ్ తన లేఖలో పేర్కొన్నారు.
అసలు సమస్య ఏమిటంటే డబ్బు. అసలు కాంట్రాక్టు ప్రకారం, ఐఎంజి కమిషన్ పద్ధతిపై పని చేయవలసి ఉంది. బోర్డుకు సమకూరిన మొత్తంలో పది శాతం ఐఎంజికి అందుతుంది. ఐపిఎల్ తొలి సీజన్ లో రూ. 662 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. (రకరకాల చెల్లింపులు పోను) బిసిసిఐకి నికరంగా రూ. 15 కోట్ల మేరకే లాభం వచ్చింది.
ఐఎంజికి అందజేసే రూ. 66 కోట్లు చాలా అధికం అని బోర్డు భావించిందని, దానిపై బోర్డు తిరిగి సంప్రదింపులు జరిపి రూ. 33 కోట్లకు లేదా ఐపిఎల్ ద్వారా వచ్చిన మొత్తంలో 5 శాతానికి ఒప్పించింది. కాగా, ఖర్చులతో సహా ఐఎంజికి తొలి సీజన్ లో రూ. 42.92 కోట్ల మేరకు అందింది.
కమిషన్ పద్ధతిపై కాకుండా మిగిలిన తొమ్మిది సీజన్ లకు జరపవలసిన చెల్లింపులను నిర్థారించాలని బోర్డు ఆతరువాత సూచించింది. ఐఎంజి ఇందుకు అంగీకరించినప్పటికీ, రూ. 33 కోట్ల స్థాయిలో ఫీజుకు ఒప్పుకున్నప్పటికీ, ఇంకా సంప్రదింపులు జరపాలని బోర్డు కోరింది. 49 గేముల నిర్వహణకు సంబంధించి రూ. 33 కోట్లు కూడా అధిక మొత్తమేనని బిసిసిఐ సభ్యులు కొందరు అభిప్రాయపడ్డారు.
దక్షిణాఫ్రికాలో 2009 ఐపిఎల్ టోర్నీ అనంతరం బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, శ్రీనివాసనం జూన్ లో ఇంగ్లండ్ లో వైల్డ్ బ్లడ్ ను కలుసుకుని సరికొత్తగా ప్రతిపాదనను సమర్పించాలని ఐఎంజిని కోరారు. ఐఎంజి ఇందుకు నిరాకరించినప్పుడు బిసిసిఐ ఏకపక్షంగా ఆ సంస్థతో సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది.
News Posted: 1 September, 2009
|