సోమదేవ్, సానియా రికార్డ్ న్యూయార్క్ : సోమదేవ్ దేవ్ వర్మన్, సానియా మీర్జా సోమవారం న్యూయార్క్ లో యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్ విజయాలతో ఇండియా నుంచి ఒకే గ్రాండ్ శ్లామ్ టోర్నీలో రెండవ రౌండ్ చేరిన మొదటి పురుష, మహిళ క్రీడాకారులుగా రికార్డు సృష్టించారు. సానియా మీర్జా 6-2, 3-6, 6-3తో బెలారుస్ క్రీడాకారిణి ఓల్గా గొవోరుత్సోవాను ఓడించగా క్వాలిఫయర్ దేవ్ వర్మన్ 6-3, 6-4, 6-3తో పోర్చుగల్ క్రీడాకారుడు ఫ్రెడరికో గిల్ పై గెలుపొందాడు.
'చాలాకాలంగా గ్రాండ్ శ్లామ్ ల మెయిన్ డ్రాలో ఇండియా నుంచి నేను ఒక్కదానినే సింగిల్స్ ఆడుతున్నాను' అని 22 సంవత్సరాల సానియా మీర్జా చెప్పింది. ఇది ఆమెకు నాలుగవ యుఎస్ ఓపెన్. 'ఈ సంవత్సరం ఆరంభం నుంచి సోమదేవ్ ఎంతో బాగా ఆడుతూ మరింత రాటు తేలుతుండడం ఎంతో ముదావహం. ఒక శ్లామ్ రెండవ రౌండ్ లో ఇద్దరు భారతీయులు ఆడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందేమో నాకు తెలియదు' అని సానియా పేర్కొన్నది.
సోమదేవ్ మాట్లాడుతూ, 'నేను ఇప్పుడు ఉన్న స్థితి సంతోషం కలిగింస్తున్నది. చెప్పుకోదగిన విజయాలు సాధించాను.. ఇది నా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఎవరితోనైనా పోటీ చేయగలనన్న విశ్వాసాన్ని ఇది నాకు కలిగించింది' అని చెప్పాడు.
కాగా, వారిద్దరూ శ్లామ్ సింగిల్స్ లో పురోగమించిన తొలి భారత ద్వయం అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) ధ్రువీకరించింది.
News Posted: 1 September, 2009
|