ఆర్జనలో ధోనియే టాప్ న్యూయార్క్ : ప్రపంచంలో అధికంగా ఆర్జించే పది మంది అగ్ర శ్రేణి క్రికెటర్ల జాబితాలో టీమ్ ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోనిదే అగ్ర తాంబూలమని ఈ గణాంకాలను సంకలనం చేసిన 'ఫోర్బ్స్' పత్రిక వెల్లడించింది. ఈ జాబితాలో భారత ఉపఖండం నుంచి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలి కూడా ఉన్నారు.
'ప్రపంచంలో అత్యధిక ఆర్జన గల క్రికెటర్ల' జాబితాలో పది మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయంతో ధోని అగ్ర స్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్ ఎనిమిది మిలియన్ల అమెరికన్ డాలర్లతో ద్వితీయ స్థానం ఆక్రమించాడు. యువరాజ్ సింగ్, ద్రావిడ్ వరుసగా మూడవ, నాలుగవ స్థానాలలో ఉన్నారు. గంగూలి, ఆస్ట్రేలియన్ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ సంయుక్తంగా ఆరవ స్థానంలో ఉన్నారు.
'పేచెక్ గణాంకాలలో గడచిన 12 నెలలలో క్లబ్, జాతీయ జట్టు వేతనాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం చేరి ఉన్నాయి' అని ఫోర్బ్స్ పత్రిక వివరించింది. 'పుష్కలంగా నిధులు ఉన్న యజమానులు, ప్రపంచవ్యాప్తంగా గల ఆకర్షణ కారణంగా అత్యధికంగా చెల్లింపులు జరిగే పది మంది క్రీడాకారులలో తొమ్మిది మంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను స్వగృహంగా పేర్కొంటుంటారు' అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
ఈ జాబితాలో ఐదవ స్థానం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ది. అతని ఆదాయం నాలుగు మిలియన్ల అమెరికన్ డాలర్లు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలోను, ఆస్ట్రేలియన్ మైకేల్ క్లార్క్ పదవ స్థానంలోను ఉన్నారు. బ్రెట్ లీ, పీటర్సన్ చెరి మూడు మిలియన్ల అమెరికన్ డాలర్లను ఆర్జిస్తుండగా క్లార్క్ ఆదాయం రెండున్నర మిలియన్ల అమెరికన్ డాలర్లు.
News Posted: 7 September, 2009
|