సానియా పోరు ముగిసింది న్యూయార్క్ : యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత మేటి సానియా మీర్జా పోటీ డబుల్స్ లో ముగిసింది. మహిళల డబుల్స్ లో ఓడిన సానియా ఆదివారం మిక్స్ డ్ డబుల్స్ రెండవ రౌండ్ తోనే ఇంటి ముఖం పట్టవలసి వచ్చింది. సానియా, కెనడా క్రీడాకారుడు డేనియల్ నెస్టర్ జోడీ 1-6, 4-6తో వరుస సెట్లలో అమెరికన్ జోడీ కార్లీ గులిక్సన్, ట్రావిస్ పారట్ చేతుల్లో ఓడిపోయింది.
సానియా ఇప్పటికే యుఎస్ ఓపెన్ లో సింగిల్స్, మహిళల డబుల్స్ విభాగాలలో పరాజితురాలయింది. మహిళల డబుల్స్ రెండవ రౌండ్ పోటీలో సానియా, ఇటాలియన్ ఫ్రాన్సిస్కా షియావోన్ 2-6, 6-1, 5-7తో గైసెలా డుల్కో (అర్జెంటీనా), షహర్ పీర్ (ఇజ్రేల్) జోడీ చేతుల్లో ఓడిపోయారు.
అయితే, సానియా యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించినప్పటికీ ఇతర విభాగాలలో భారతీయుల పోటీ కొనసాగుతోంది. మేటి క్రీడాకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్ తమ తమ భాగస్వాములతో కలసి మిక్స్ డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోకి పురోగమించారు.
News Posted: 7 September, 2009
|