కెమెరామన్ ను కొట్టిన భజ్జీ బెంగళూరు : ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (భజ్జీ) బుధవారం సరికొత్త వివాదాన్ని చేజేతులారా కొని తెచ్చుకున్నాడు. శ్రీలంకలో ముక్కోణపు వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) సీరీస్ కోసం భారత క్రికెట్ జట్టు బయలుదేరడానికి ముందు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఫోటోగ్రాఫర్ కొట్టాడు. ఎప్పుడూ ఏవో కారణాలతో వార్తలలో వ్యక్తిగా ఉంటుండే భజ్జీ విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ముందు ఒక కారులో నుంచి తన లగేజిని బయటకు తీస్తున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా పొరపాటున తన తలకు తగిలిన అనంతరం అతనిపై చేయి చేసుకున్నాడు. తనను చుట్టుముట్టిన ఫోటోగ్రాఫర్ల బృందాన్ని భద్రతా సిబ్బంది ఒక వైపు వెనుకకు నెట్టుతుండగా కూడా హర్భజన్ ఆ కెమెరామన్ వైపు కోపంతో చూశాడు.
29 సంవత్సరాల పంజాబ్ స్పిన్నర్ హర్భజన్ కు క్రమశిక్షణ లేనివాడుగా ఒక రికార్డు ఉంది. తన కెరీర్ లో వివిధ దోషాలకు అతను శిక్షకు గురయ్యాడు. సిడ్నీలో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ పై జాతి వివక్షతో నిందావాక్యాలు పలికాడనే ఆరోపణకు హర్భజన్ గురయ్యాడు. 2007నాటి ఆ 'మంకీ-గేట్' ఉదంతం పెద్ద సంక్షోభానికి దారి తీసి క్రికెట్ ప్రపంచాన్ని చీల్చే ప్రమాదం కూడా ఏర్పడింది. అదే సంవత్సరం హర్భజన్ మొహాలిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లో తన భారత సహచరుడు శాంతకుమారన్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టినందుకు తక్కిన ఐపిఎల్ పోటీలు ఆడకుండా అతనిపై నిషేధం విధించారు. ఆ చెంపదెబ్బ ఉదంతం అనంతరం తన పద్ధతులు మార్చుకుంటానని, తన ఉద్రేకాన్ని అణచుకుంటానని హర్భజన్ వాగ్దానం చేశాడు.
News Posted: 10 September, 2009
|