ఫైనల్ లో టీమిండియా కొలంబో: డాషింగ్ బ్యాట్స్ మాన్ సెహ్వాగ్, స్టార్ ఓపెనర్ గంభీర్ లేకుండానే భారత్ క్రికెట్ జట్లు విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ ముక్కోణపు సీరీస్ మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను మట్టికరిపించింది. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి వుండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. రైనా (45 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత 156 పరుగుల లక్ష్యాన్ని మరో 57 బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.3 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ను నెహ్రా దెబ్బతీశాడు. తొలి ఓవర్ మూడో బంతికే ప్రమాదకర బ్యాట్స్‌మన్ రైడర్(0)ను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టు పతనానికి శ్రీకారం చుట్టాడు. రెండో ఓవర్‌లో మెకుల్లమ్ (4) వికెట్‌ను పడగొట్టి కివీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 4 పరుగులే. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కివీస్ 155 పరుగులకే పరిమితమైంది. నెహ్రా, యువరాజ్‌లకు మూ డేసి వికెట్లు దక్కాయి. కాగా, ఆర్పీ, ఇషాంత్ రెండేసీ వికెట్లు పడగొట్టారు.
తర్వాత సునాయాస లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దినేష్ కార్తీక్(4) పరుగులు మాత్రమే చేసి మిల్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 7 పరుగులే. తర్వాత వచ్చిన ద్రవిడ్‌తో కలిసి సచిన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ద్రవిడ్ 45 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సచిన్ 55 బంతుల్లో 6ఫోర్లతో 46 పరుగులు సాధించాడు. ఒక దశలో కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రైనా(45) నాటౌట్, ధోనీ (35) నాటౌట్ జాగ్రత్తగా ఆడుతూ మరో వి ెట్ పడకుండానే జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్‌లో రాణించిన నెహ్రాకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, తొలి మ్యాచ్‌లో లంక చేతిలో ఓటమి పాలైన కివీస్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. సోమవారం జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడుతాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తొలి సారిగా నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకొంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఐసిసి ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకొంది.
News Posted: 11 September, 2009
|