'ఒడిఐ ఓవర్లు కుదించండి' న్యూఢిల్లీ : వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) క్రికెట్ పోటీల భవితవ్యంపై సాగుతున్న చర్చలో తాజాగా టీమ్ ఇండియా మాజీ సారథి అనిల్ కుంబ్లె కూడా చేరాడు. ఈ తరహా క్రికెట్ అంతరించి పోకుండా ఉండాలంటే 50 ఓవర్లకు 40 ఓవర్లకు మాత్రమే ఒక ఇన్నింగ్స్ ను పరిమితం చేయాలని కుంబ్లె సూచించాడు.
ట్వంటీ20 క్రికెట్ రంగ ప్రవేశంతో ఒడిఐల భవిష్యత్తు అయోమయంలో పడింది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) 2010లో తన దేశీయ పోటీల క్యాలెండర్ లో నుంచి 50 ఓవర్ల పోటీని పూర్తిగా తొలగించింది. ఇక మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50 ఓవర్ల మ్యాచ్ ను రెండు ఇన్నింగ్స్ మ్యాచ్ గా మార్చడం మంచిదని ఇటీవల సలహా ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ సూచనను పరిశీలించగలమని ప్రకటించింది కూడా.
శుక్రవారం ఢిల్లీలో వాన్ హ్యూసెన్ ఇండియా మెన్స్ ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి హాజరైన కుంబ్లె విడిగా మీడియాతో మాట్లాడుతూ, 'ఒడిఐ క్రికెట్ అంతరించిపోతుందని నేను భావించడం లేదు. కాని ఈ విభాగం అభివృద్ధికి కొద్దిగా అంతరాయం కలగవచ్చు. సచిన్ సూచించిన తరహా వినూత్న మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఉంది. అయితే, ఒడిఐలను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించవచ్చునని నా సూచన' అని చెప్పాడు.
News Posted: 12 September, 2009
|