చిత్తు చిత్తుగా ఓడింది కొలంబో : బ్యాట్స్ మెన్ చేతులు చచ్చుబడిపోయాయి. బౌలర్ల కాళ్ళ నరాలు పట్టు వదిలేశాయి. మొత్తానికి పక్షవాతం వచ్చిన రోగుల్లా చచ్చు ఆట ప్రదర్శించారు. గెలుపు ఓటములు సహజమే కానీ ప్రపంచం నంబర్ వన్ టీమిండియా అస్సలు ఎలాంటి పోరాటపటిమ కనబరచకుండా, వ్యూహం లేకుండా చేతులెత్తేయడమే ఆగ్రహానికి కారణం. అయితే మనవాళ్లు ఈ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోకపోయి ఉండాలి. ఫైనల్లో చూసుకుందాంలే అన్న ధీమాతో. లేదా మ్యాచ్ ఫిక్సింగ్ అయినా అయి ఉండాలని సగటు క్రికెట్ ప్రేమికుడు అనుమానించే దారుణమైన వన్డే ఇది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ 139 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. 308 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 37.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్ మాథ్యుస్ అద్భుత బౌలింగ్‌తో ఆరు వికెట్లు పడగొట్టి భారత్‌ను వెన్ను విరిచాడు. వెటరన్ బ్యాట్స్‌మన్ ద్రవిడ్ అత్యధికంగా (47) పరుగుల చేయగా, సచిన్ (27) పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్న ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. దీంతో టీమిండియా టాప్ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకొంది. ఓపెనర్లు దిల్షాన్-జయసూర్య ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరిగెత్తించారు. దిల్షాన్ వేగంగా ఆడి 27 బంతుల్లో 4ఫోర్లతో 23 పరుగులు చేశాడు. మరోవైపు వెటరన్ జయసూర్య అద్భుత షాట్లతో భారత బౌలర్లను హడలెత్తించాడుభారత బౌలర్లు లంకపై ప్రతాపం చూపలేక పోయారు. దీంతో పరుగుల వరద పారింది. ఒకవైపు వికెట్లు పడుతున్న జయసూర్య జోరు కొనసాగించాడు. సనత్ 79 బంతుల్లో 13 ఫోర్లతో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నెహ్రా అద్బుత బంతితో అతన్ని ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులో వచ్చిన కదంబి అద్భుత షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కపుగెడెర (36) సహకారంతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 73 బంతుల్లో 11 ఫోర్లతో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడడంతో లంక స్కోరు 300 పరుగులు దాటింది. భారత బౌలర్లలో హర్భజన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు కార్తీక్-సచిన్ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. కార్తీక్ 16 పరుగులు చేసి తుషార బౌలింగ్‌లో ఔటయ్యాడు. 27 పరుగులు చేసిన సచిన్‌ను కులశేఖర పెవిలియన్ పంపాడు. తర్వాత వచ్చిన యువరాజ్‌ను మలింగ అద్భుత బంతితో యువరాజ్‌ను ఔట్ చేశాడు. ఈ సమయంలో బౌలింగ్‌కు దిగిన మాథ్యుస్ భారత బ్యాటింగ్‌ను శాసించాడు. అతని ధాటికి రైనా(0), ధోనీ(8), యూసుఫ్(1), హర్భజన్ (4), నెహ్రా(1) పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 168 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌లో రాణించిన మాథ్యుస్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. సోమవారం జరిగే ఫైనల్లో భారత్-లంక తలపడుతాయి.
News Posted: 12 September, 2009
|